ప్రశ్నపత్రాల లీకేజీకి కేంద్రబిందువుగా మారిన టీఎస్పీఎస్సీ బోర్డు వివాదాస్పదమైపోయింది. బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకంలో వివిధ రంగాల్లో నిపుణులను, చిత్తశుద్ది ఉన్నవారిని నియమించాల్సిన ప్రభుత్వం అడ్డుగోలుగా భర్తీ చేసిందని అందరు మండిపోతున్నారు. గ్రూపు 1 ప్రవేశపరీక్షలతో పాటు బోర్డు మరికొన్ని పరీక్షలను కూడా రద్దుచేసింది. దాంతో నిరుద్యోగులు, పరీక్షలు రాసిన వాళ్ళు, రాజకీయపార్టీలు బోర్డు ముందు రోజులుగా నానా రచ్చ చేస్తున్నారు. ఈ సమయంలోనే బోర్డు ఛైర్మన్ , సభ్యుల నియామకాలపై బాగా ఆరోపణలు మొదలయ్యాయి.
బోర్డు ఛైర్మన్ గా ఉన్న ఐఏఎస్ అధికారి జనార్ధనరెడ్డికి గొప్ప ఆపీసరుగా పేరేమీ లేదు. ఈయన పనితీరుపై కేసీయార్ గతంలో చాలాసార్లు అసంతృప్తి వ్యక్తంచేశారట. అలాగే సభ్యులుగా రాజకీయ ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకు సన్నిహితంగా ఉండేవారిని, రాజకీయ సిఫార్సులు చేయించుకున్న వాళ్ళని, ఉద్యోగసంఘాల నేతలను, ఉద్యమంలో పనిచేసిన వారిని, రాజకీయంగా ఉపయోగపడిన వారు, ఉపయోగపడతారని అనుకున్న సామాజికవర్గాల సంఘాల నేతలను ఏరికోరి బోర్డులో కేసీయార్ సభ్యులుగా నియమించారట.
సభ్యుల్లో కొందరి నేపధ్యం అయితే మరీ అన్యాయంగా ఉందని అంటున్నారు. ఉద్యోగంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడి, విజిలెన్స్ విచారణను ఎదుర్కొన్న వారిని కూడా ప్రభుత్వం బోర్డులో నియమించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి బోర్డు నిష్పక్షపాతంగా ఉంటే కొన్ని లక్షలమంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అదే బోర్డులో అవినీతిపరులు, అసమర్దలుంటే నిరుద్యోగులపాలిట శాపమవుతుంది.
ఇపుడు జరిగింది రెండోదే. ఛైర్మన్, సభ్యుల నియామకంలో ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే నిరుద్యోగుల ఫలితం అనుభవిస్తున్నారు. ఎంతోకష్టపడి చదివి పరీక్షలు రాస్తే కొంతమంది కారణంగా పేపర్ లీకవ్వటం, పరీక్షలు రద్దయ్యాయంటే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రంలో ఇంత గోల జరుగుతుంటే ఛైర్మన్ ఇంతవరకు నోరిప్పి మాట్లాడలేదు. పరీక్షల నిర్వహణలో ఏమిజరిగిందనే విషయాన్ని కూడా ఛైర్మన్, సభ్యులు మీడియాతో చెప్పలేదంటేనే అర్ధమైపోతోంది వాళ్ళ నిర్లక్ష్యం. ఇందుకనే బోర్డు నియమాకాల విషయంలో ముప్పేట దాడులు జరుగుతున్నాయి. ముందు బోర్డును రద్దుచేయాలని బీజేపీ, కాంగ్రెస్ అద్యక్షుల డిమాండ్లు ఇందులో భాగమనే అనుకోవాలి.