విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏపీలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును బేరం పెట్టింది సీఎం జగన్ అని, అందుకే ఈ ప్రైవేటీకరణ అంశంపై జగన్ నోరు మెదపడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే, చంద్రబాబు హయాంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బీజం పడిందని, అందుకే చంద్రబాబు ఇపుడు కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయడం లేదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అది అవాస్తవవమని ఆధారాలతో సహా బయటపెట్టారు.
2014 జులై 14న పోస్కో కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారని, ఆ భేటీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు డీల్ కుదరిందన్నది దుష్ప్రచారమని ఫొటోలతో సహా నిరూపించారు. 2016, అక్టోబరు 26న దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని, ఆ భేటీ ఫొటోను పట్టుకొని వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకోకుండా వైసీపీ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో ఈ ఫొటోను పోస్ట్ చేసి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ మాటకొస్తే గత ఏడాది అక్టోబర్ లో పోస్కో ప్రతినిధులతో భేటీ అయింది జగన్ అని, నాలుగు రాష్ట్రాలు పొమ్మన్న పోక్సోకు రెడ్ కార్పెట్ వేసింది జగన్ రెడ్డి అని విమర్శిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా విశాఖ ఉక్కును కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని, పోస్కోను ఎందుకు ఆహ్వానిస్తుందని ప్రశ్నిస్తున్నారు. అధికారం ఉంది కదా అని సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టడం వల్ల వైసీపీ ప్రభుత్వం పరువు పోతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఇకనుంచైనా ఇటువంటి పోస్టులు పెట్టడం మానాలని హితవు పలుకుతున్నారు.