ఎన్నికల్లో ఓటమి అంత స్పష్టంగా కనిపిస్తున్నా.. తాను పట్టుకున్నకుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ట్ ట్రంప్ తీరు ఉంది. ఇప్పటికే పలుమార్లు తాను అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోలేదని.. డెమొక్రాట్లు రిగ్గింగ్ చేయటం కారణంగా ఓటమిపాలైనట్లుగా చెప్పుకోవటం తెలిసిందే. తాజాగా ఆయన.. ఇదే తరహా వ్యాఖ్యల్ని తాజాగా ఏర్పాటు చేసిన సభలో వ్యాఖ్యానించటం గమనార్హం.
డెమొక్రాట్లు మోసం చేశారని.. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడినట్లుగా వ్యాఖ్యానించిన ఆయన.. ‘‘రిగ్గింగ్ చేసిన ఎన్నికల్లో బైడెన్ విజేతగా నిలిచారు. నేను ఓడిపోయాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. జనవరి ఐదున జరిగే స్పెషల్ సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫు శనివారం జార్జియాలో ప్రచారాన్ని నిర్వహించారు ట్రంప్. ఈ సందర్భంగా ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఆ ఎన్నికల్లోనూ అవకతవకలు జరుగుతాయని చెప్పారు.
ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత.. ప్రజల మధ్యకు వచ్చి ట్రంప్ ఈ రీతిలో మాట్లాడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. తాను నిజంగానే ఓటమిపాలైతే.. ఆ ఓటమి చాలా గొప్పగా ఉండేదని.. అప్పుడు తనకు తానే ఓడినట్లుగా చెప్పకొని ఇంటికి వెళ్లేవాడినని చెబుతున్న ట్రంప్ మాటల్ని వింటే.. ఆయనకు ఆయన నేను ఓడాను అని చెప్పే వరకు వచ్చే ఓటములన్ని రిగ్గింగ్ తోనో.. మోసపూరితంతోనో ఉంటాయని అనుకోవాలేమో?