కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి పేర్కొన్న అంశాలపై ట్రక్కు డ్రైవర్లు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అమల్లోకి రాని ఈ చట్టానికి సంబంధించి హిట్ అండ్ రన్ పై పేర్కొన్న రీతిలో కాకుండా.. మార్పులు చేయాలన్నది వారి డిమాండ్. ఇందులో భాగంగా ఈ కొత్త చట్టంపై తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు మూడు రోజుల పాటు నిరసన చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.
అయితే.. ఈ సమ్మె వ్యవహారానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పోటెత్తటం.. పెట్రోల్.. డీజిల్ కు కొరత ఏర్పడుతుందన్న పోస్టులతో ఒక్కసారిగా ప్రజలు అలెర్టు అయ్యారు. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. దీంతో.. ఒక్కసారిగా రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి.దీనికి సంబంధించిన ప్రభావం ఎంత ఉంటుందన్నది హైదరాబాద్ మహానగర ప్రజలు మంగళవారం ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన పరిస్థితి.
ఇంతకూ ట్రక్కు డ్రైవర్ల సమ్మెకు అసలు కారణం ఏమిటి? త్వరలో చట్టంగా రాబోతున్న దానిలో ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నిబంధనలు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. హిట్ అండ్ రన్ కేసులో గరిష్ఠంగా పదేళ్లు జైలు.. భారీ జరిమానాను అందులో పేర్కొన్నారు. దీనిపై ట్రక్కులు.. లారీలు.. ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి చట్టాలతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయన్నది వారి ఆందోళన.
ఈ కొత్త నిబంధనలో రూ.7లక్షల ఫైన్ చెల్లించటం కూడా సాధ్యం కాదని వారు చెబుతుననారు. ఈ నిబంధనలతో కొత్త వారు ట్రక్కు డ్రైవర్లుగా పని చేసేందుకు ముందుకు రారని.. అలాంటిదే జరిగితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి. అందుకే శిక్షతో పాటు ఫైన్ కూడా తగ్గించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ట్రక్కు డ్రైవర్ల మూడు రోజుల సమ్మె వ్యవహారం దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఈ సమ్మెతో పెట్రోల్.. డీజిల్ కొరత ఖాయమని.. అదే జరిగితే ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతారంటూ అలెర్టు మెసేజ్ లు.. వార్తలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. దీంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో భారీ ట్రాఫిక్ జాంలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు.. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆలిండియా ట్రాన్స్ పోర్టు సంఘాలతో భేటీ అయ్యారు.
తాము అన్ని వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత కొత్త నిబంధనల అమ్మలోకి వస్తుందని.. ఇప్పటికిప్పుడు ఏమీ రాదని స్పష్టం చేశారు. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సంఘాలు సమ్మెను విరమిస్తున్న నిర్ణయాన్ని ప్రకటించాయి.