మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే.. సీనియర్ నేత నోముల నర్సయ్య మరణించారు. ఫైర్ బ్రాండ్ రాజకీయ నేతగా.. మంచి వాగ్దాటి ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. సీపీఎం ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన తర్వాతి కాలంలో టీఆర్ఎస్ లోకి చేరారు.
కొద్దికాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని హైదర్ నగర్ లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు.
మొదట్నించి కమ్యునిస్టు నేతగా ఉన్న ఆయన.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. 1999.. 2004లో సీపీఎం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 2009లో భువనగిరి ఎంపీగా సీపీఎం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2013లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాస్త ముందు జరిగిన ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత జానారెడ్డి మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన ఆయన.. జానారెడ్డి మీద గెలిచి బదులు తీర్చుకున్నారు. సీపీఎం నేతగా ఉన్న సమయంలో ఫైర్ బ్రాండ్ నేతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఆయన పదునైన మాటలు.. సూటి వాదనలు.. అందరిని ఆకర్షించేవి. నోముల నర్సయ్యది నకరికల్లు మండలం పాలెం గ్రామానికి చెందిన వారు. ఆయనకు ఒక కొడుకు.. ఇద్దరుకుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా మెడపై కణితితో పాటు.. శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతన్నారు.
ఇప్పటికే కరోనా వైరస్ ను జయించిన ఆయన.. తనకున్న అనారోగ్యాన్ని మాత్రం జయించలేకపోయారు. శ్వాస సంబంధిత సమస్యల్ని అధిగమించటానికి రోజుకు నాలుగైదు గంటలు యోగా చేసినా.. ఆయన ఈసారి ఓడిపోక తప్పలేదు. ఆయన మరణవార్తతో ఆయన స్వగ్రామంలోనూ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ లోనూ విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఆయన నియోజకవర్గంలో నోముల నర్సయ్య పార్థిప దేహాన్ని ప్రదర్శనకు ఉంచి.. రేపు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.