తెలంగాణలో కొద్ది నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బీజేపీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో అధికార పార్టీకి తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆ తర్వాత అదే ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు బీజేపీ గట్టిపోటీనిచ్చింది. దీంతో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
అయితే, గత ఫలితాలను దృష్టిలో ఉంచుకున్న గులాబీ బాస్ కేసీఆర్….సాగర్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. హాలియాలో బహిరంగ సభకు హాజరై సాగర్ తో పాటు నల్లగొండ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. దాని ఫలితంగానే తాజాగా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత నేత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ ఘన విజయం సాధించారు. సాగర్ ప్రజలు సెంటిమెంట్ కు పట్టం కట్టడంతో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.
కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ పొలిటిషియన్ జానారెడ్డిని తోసిరాజని నోముల భగత్ 19,281 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 9 రౌండ్ల వరకు భగత్ ఆధిక్యం కొనసాగగా… ఆ తర్వాత అనూహ్యరీతిలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మూడు రౌండ్ల పాటు దూకుడు ప్రదర్శించారు. ఆ తర్వాతి రౌండ్లలో భగత్ పుంజుకొని టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలువగా, బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కలేదు.
ఈ విజయాన్ని సీఎం కేసీఆర్కు అంకితం చేస్తున్నట్లు భగత్ ప్రకటించారు. గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. తండ్రి నోముల నర్సింహ్మయ్య ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తానని, పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తానని నోముల భగత్ ప్రకటించారు. నాగార్జున సాగర్ లో సిట్టింగ్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.