బంగారు తెలంగాణ తెస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీని మాత్రం బంగారుమయం చేసుకున్నాడు. ఎందుకంటే ఇపుడు ఆ పార్టీ వద్ద ఉన్న డబ్బుతో అన్ని జిల్లాల్లో బంగారు తో టీఆర్ ఎస్ ఆఫీసులు కట్టొచ్చు. అంత రిచ్ అయిపోయిందా పార్టీ.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) 2019-20 ఆర్థిక సంవత్సరానికి జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆస్తులు మరియు అప్పుల జాబితా విడుదల చేసింది.
2019 ఆర్థిక సంవత్సరానికి 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులు, అప్పులు మరియు మూలధనాన్ని పరిగణనలోకి తీసుకుంది. నివేదిక ప్రకారం, 44 ప్రాంతీయ రాజకీయ పార్టీలలో, టాప్ 10 పార్టీల ఆస్తుల విలువ రూ. 2,028 కోట్లు కాగా, ఇది అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తులలో 95 శాతం. అంటే మిగతా 34 పార్టీలతో కేవలం 5 శాతం ఆస్తులే ఉన్నాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో, ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా రూ. 563 కోట్లు (26.46 శాతం) సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) వద్ద ఉండగా, టిఆర్ఎస్ రూ. 301 కోట్లతో రెండో స్థానంలో ఉంది. టీఆర్ఎస్కు చెందిన మొత్తం రూ.301.47 కోట్ల ఆస్తుల్లో రూ.256.01 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. టీఆర్ఎస్కు రూ.21.27 స్థిర ఆస్తులున్నాయి. ఈ పార్టీ బకాయిలు రూ.4.41 కోట్లు మాత్రమే.
ఎస్పీ అత్యధికంగా రూ.563.099 కోట్ల మూలధనాన్ని ప్రకటించగా, టీఆర్ఎస్, అన్నాడీఎంకే వరుసగా రూ.297.06 కోట్లు, రూ.267.48 కోట్లుగా ప్రకటించాయి. టీఆర్ఎస్ పార్టీ క్యాపిటల్ రిజర్వ్ ఫండ్ రూ.297.06 కోట్లు. టీఆర్ఎస్ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం ఇప్పుడు రూ.420 కోట్లకు పెరిగింది. 2021 అక్టోబర్లో జరిగిన పార్టీ సమావేశంలో, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ “ఆర్థికంగా పటిష్టంగా” ఉందని ప్రకటించారు.