వైసీపీలో ట్రబుల్ షూటర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువుగా కూడా ఉన్నారు. కొన్నాళ్ల కిందటి వరకు.. ఆయన ఏం చెప్పినా.. సాగింది. ఆయన మాటే వేదంగా కూడా నిలిచింది. పార్టీలోనూ.. జిల్లాలోనూ ఆయనంటే.. ఒక ఇమేజ్ ఏర్పడింది. అయితే.. ఎన్నికల సమయానికి ఆయన పరిస్థితి అటు పార్టీలోనూ.. ఇటు జిల్లాలోనూ మైనస్ అయిపోయిందని అంటున్నారు వైసీపీ నాయ కులు. ఒకప్పుడు ఎగిరెగిరిపడిన ఆయన ఇప్పుడు చడీచప్పుడు లేకుండా పోయారని చెబుతున్నారు.
ఆయనే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. 2021-22 మధ్య ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీని ఆయన చేతిలో పెట్టుకున్నా రు. ఆయన చెప్పినట్టే రాజకీయాలు కూడా సాగాయి. స్తానిక సంస్థల ఎన్నికల సమయంలో తన అనుచరులకు అవకాశం దక్కలేదన్న ఆవేదనతో వారిని సొంతగా పోటీకి పెట్టి గెలిపించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ను బుజ్జగించి.. తిరిగి వారిని వైసీపీలోకి చేరేలా ప్రోత్సహించారు.
అదేసమయంలో వైసీపీ ఎదుగుదలలోనూ బాలినేని కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. నేనున్నానంటూ.. బాలినేని దూకుడుగా వ్యవహరించారు. అయితే.. అనూహ్యంగా ఆయనను మంత్రి వర్గం నుంచితప్పించిన నాటి నుంచి పార్టీకి-బాలినేనికి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఆయన బావ.. వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు మరింతగా పెరిగాయి. వైవీ వర్గంగా ఉన్నవారికి పార్టీ పదవులు ఇవ్వడం ప్రారంబించింది.
ఇది బాలినేనిని తీవ్ర సంకటంలోకి నెట్టేసింది. ముఖ్యంగా నాటి మంత్రి ఆదిమూలపు సురేష్.. వైవీ వర్గంలో ఉండడం, ఆయనకు రెండో సారి కూడా మంత్రి పదవి ఇవ్వడం, తర్వాత వెలుగు చూసిన భూ కుంభకోణం వంటివి బాలినేని రాజకీయాలకు పెద్ద సంకటంగా మారాయి. ఇక, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే.. ఆయన చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదు.అసలు బాలినేనికే టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి.. ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. ట్రబుల్ షూటర్‌గా ఒక వెలుగు వెలిగిన.. బాలినేని.. అంతే వేగంగా కిందకు జారిపోయారు. మరి తర్వాత.. ఏం జరుగుతుందనేది చూడాలి.