“నేను కూడా క్రాస్ ఓటింగ్ చేసి ఉంటే.. పది కోట్లు ఇస్తామన్నారు“ అంటూ.. తూర్పు గోదావరి జిల్లా రాజో లు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇది ఎందుకు అన్నారో.. అందరికీ తెలిసిందే. అయితే.. “ఆయన చేసిందే పెద్ద తప్పు.. ఇలాంటి తప్పుడు నాయకుడు.. తప్పులు చేయడం తప్పు! అని ఎలా చెబుతా“రంటూ.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు. విజయం దక్కిం చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తొలినాళ్లలో వైసీపీని దుమ్మెత్తిపోశారు. “వైసీపీ డబ్బులు పెట్టి గెలిచింది. ఒక్కొక్క నియోజకవర్గంలోనూ జగన్ తన అవినీతి సొమ్మును కుమ్మరించి.. ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను. మా దగ్గర(జనసేన) డబ్బులు లేవు. మేం నిజాయితీగా పోటీ చేశాం. ప్రజలు నన్ను పవన్ ఫొటో చూసే ఆదరించారు. ఆయనకు రుణ పడి ఉంటాను“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తాను వైసీపీలోకి వెళ్తే.. 152వ వాడిని అవుతానని.. అదే జనసేనలో ఉంటే.. సింగిల్‌గా ఉన్నా సింహంగా.. పవన్ చేయి పట్టుకుని నడుస్తానని చెప్పిన విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే.. రాజకీయాల్లో నాయకులకు గతాన్ని మరిచిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి.. రాపాక కూడా దీనికి భిన్నం కాదు. కానీ, ఇప్పుడు నీతులు చెప్పడం.. జగన్ ను అభ్యుదయ వాదిగా కీర్తించడం చూస్తే.. ఆయన మాటలకు విశ్వసనీయత అసలు ఉందా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా ప్రస్తావిస్తున్నారు. రాపాక సర్.. గతంలో ఏమన్నారో.. గుర్తుందా? అని నిలదీస్తున్నారు. తమకు ఎన్ని కోట్లకు అమ్ముడు పోకపోతే.. హఠాత్తుగా జనసేనకు మంగళం పాడి.. వైసీపీ వైపు చూస్తారు? మంత్రి పదవి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? మీరువైసీపీలోకి వెళ్లాక.. 150 కోట్ల విలువైన ఆస్తులు సంపాయించుకోలేదా? అని నిలదీస్తున్నారు. అవసరం-అవకాశం అనే పట్టాలపై నడుస్తున్న నాయకులు, పార్టీలు.. తప్పులు చేయడం సహజమే.. కానీ, సందర్భం వచ్చినప్పుడు వాటిని మరిచిపోయినట్టు నటించడం.. మీకే మంచిది కాదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.