లలితా జ్యువెల్లర్స్. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలోనూ ఇది బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా దీని అధినేత కిరణ్ కుమార్ ‘‘డబ్బులు ఊరికే రావు. కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేయకండి. ఎవరూ ఏది ఫ్రీ గా ఇవ్వరు. మీ దగ్గర డబ్బులు తీసుకునే ఫ్రీ గిఫ్ట్ ఇస్తారు. లలితా జ్యువెల్లర్స్ నగలు కొనమని నేనే చెప్పడం లేదు. లలితాతో ఇతర షోరూంల ధరలు కంపేర్ చేయమని చెబుతున్నాను. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి’’ అన్న ప్రకటన ఎంతో పాపులర్ అయింది.
అయితే తాజాగా లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్ ఫుట్ ట్యూక్స్ క్రెడిట్ వ్యవహారంలో అధికారులకు దొరికిపోయాడు. హైదరాబాద్ పంజాగుట్ట లలితా జ్యువెల్లరీ బ్రాంచ్ కు సంబంధించి 2017 – 18 ఏడాదికి గాను జీఎస్టీ ఇన్ ఫుట్ ట్యూక్స్ క్రెడిట్ కు సంబంధించి రూ.56.61 కోట్లను క్రెడిట్ చేసుకున్నారు.
అయితే అక్కడ సమర్పించిన లెక్కల ప్రకారం చూస్తే రూ.41.22 కోట్లు మాత్రమే రావాల్సి ఉందట. రావాల్సిన దానికంటే అధికంగా రూ.15.39 కోట్లు పొందినట్లు లెక్కల్లో తేలింది. తప్పుడు లెక్కలను పరిశీలించిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. రాష్ట్రంలో రాండమ్ చెకింగ్ లో భాగంగా అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్న సంస్థల వివరాలు పరిశీలించినప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాాచారం.