ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్ అస్తవ్యస్థ పాలన, ఏక పక్ష నిర్ణయాలు వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ వస్తోంది. కొత్త పెట్టుబడుల సంగతి దేవుడెరుగు….ఉన్న సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు హయాంలో రూ.70 వేల కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అదానీ గ్రూప్…జగన్ హయాంలో ఆ ప్రాజెక్టును హైదరాబాద్కు తరలించింది. రూ. 15 వేల కోట్ల విలువైన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా ఏపీ నుంచి తరలివెళ్తోంది. అయితే, గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదన్నట్టు…ఏపీకి రూపాయి పెట్టుబడులు తీసుకురాని జగన్…హెలికాప్టర్ లో తిరగడానికి మాత్రం 18 నెలలకు రూ. 26 కోట్లు ఖర్చు చేశారని విమర్శలు వస్తున్నాయి.
జగన్ బేసిక్ పే ఒక్క రూపాయి అని కానీ, ఎయిర్ అలవెన్స్లు మాత్రం రూ.26 కోట్లు అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో పర్యటనల కోసం రూ.32 కోట్లు ఖర్చు పెట్టి రూ.1.39 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని.. కానీ జగన్ 18 నెలల్లో రూ.26 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయి పెట్టుబడి తేలేదని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 18నెలల్లో జగన్ ‘గాలి’ తిరుగుడికి (సాధారణ విమాన ప్రయాణాలు కాకుండా) పెట్టిన ఖర్చంత (26 కోట్ల రూపాయలు) కూడా పెట్టుబడులు రాలేదని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఐదేళ్లలో చంద్రబాబు చార్టెడ్ ఫ్లయిట్ కు అయిన ఖర్చు రూ.32 కోట్లు అని, తెచ్చిన పెట్టుబడులు రూ.1.39 లక్షల కోట్లని, ఈ లెక్కన జగన్ ఐదేళ్లలో దాదాపు రూ.1.50 లక్షల కోట్లు చార్టెడ్ ఫ్లయిట్లకు ఖర్చు చేసే అవకాశముందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన ఐదేళ్ల పాలనలో చార్టెడ్ ఫ్లయిట్లకు అయిన ఖర్చంత పెట్టుబడులైనా జగన్ రాష్ట్రానికి తేగలరో లేదో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.