ఓటమి భయంతోనే జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి: లోకేష్

ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ నానాటికీ పెరిగిపోతోంది. పార్టీరహిత ఎన్నికలైనప్పటికీ అనధికారికంగా అభ్యర్థులంతా తమ తమ పార్టీల తరపునే బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రోజుతో రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో...పంచాయతీ పోరు ఊపందుకుంది. ఈ క్రమంలోనే గెలుపు కోసం, బలవంతపు ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నేతలు బెదిరింపులు, దబాయింపులకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పచ్చటి గ్రామాల్లో వైసీపీ నేతలు చిచ్చు రేపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గ్రామాల్లో జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయని, పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయకుంటే కాళ్లు విరగ్గొడతానంటూ ధర్మవరానికి చెందిన వైసీపీ నేత.... గ్రామస్తులను బెదిరించిన ఆడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై లోకేష్ మండిపడ్డారు. ధర్మవరంలో అధికార పార్టీకి చెందిన నేత...ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల బెదిరింపులు పోలీసులకు వినబడడం లేదని, కనపడడం లేదని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచి మూర్ఖంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీస్ శాఖకు లేదా? అని లోకేష్ ప్రశ్నించారు. కాగా, విశాఖ జిల్లా ఎలమంచిలిలో వైసీపీ రెబల్ అభ్యర్థి అల్లుడు సంతోష్ ను ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. కన్నబాబురాజుపై పోలీసులకు సంతోష్ ఫిర్యాదు కూడా చేశాడు. అయితే, తాను బెదిరించినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కన్నబాబు రాజు సవాల్ విసిరారు. ఇలా, వైసీపీ నేతలు యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ ఇటు ప్రభుత్వం ....అటు పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుండడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.