పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన “భీమ్లా నాయక్” హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. టాలీవుడ్ తో పాటు అమెరికాలోనూ బాక్స్ ఆఫీస్ ను ‘భీమ్లా నాయక్’ షేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
80, 90వ దశకాలలోని నటీనటుల కంటే ఈ తరం నటీనటులు బాగా ఎదిగిపోయారని త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే, తాను ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కొందరికి బాధ కలగొచ్చని, వారంతా తనను క్షమించాలని కోరారు. గత ఆరేళ్ళ నుంచి చూస్తున్నానని, ఈ తరం నటీనటులు డైలాగులు, లుక్స్ పరంగానే కాకుండా 24 క్రాఫ్ట్స్ పై కూడా మంచి పరిజ్ఞానాన్ని సంపాదిస్తున్నారని గురూజి ప్రశంసలు కురిపించారు.
దర్శకుడు సాగర్ ఈ కథని ఎంతగానో అర్థం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించారని, మొగిలయ్యతో పాట పాడించాలన్న ఐడియా సాగర్ దేనని గురూజి గుర్తు చేసుకున్నారు. ఇక, కరోనా సమయంలో కూడా జనాల మధ్య భయం లేకుండా రానా, పవన్ నటించారని కితాబిచ్చారు త్రివిక్రమ్. 600 మందితో లాలా భీమ్లా పాటను గణేష్ మాస్టర్ కంపోజ్ చేశారని, అంతమందిని చూసి తాను సెట్ నుంచి పారిపోయానని అన్నారు. ఆ పాటకు గణేష్ మాస్టర్ మంచి స్టెప్పులు కంపోజ్ చేశారని కితాబిచ్చారు. మలయాళంలో కోషి కురియన్ తరఫు నుంచి కథ ఎక్కువగా ఉంటుందని, దానిని పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా అయ్యప్పన్ నాయర్ తరఫు నుంచి చెప్పేందుకు కథకు మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.