అయోధ్య రామాలయాన్ని ఈ నెల 22న ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యావత్ దేశం అయోధ్య రామాలయ ప్రారంభం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి అందరి అంచనాలకు భిన్నంగా రాములోరి సేవకు వచ్చేందుకు సిద్దమవుతున్న కొందరి మహిళలు ఇప్పుడు సంచలనంగా మారారు. వారే.. ట్రిపుల్ తలాక్ బాధితులు.
ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలు పెద్ద ఎత్తున ఈ నెల 26 తర్వాత అయోధ్య రామమందిరానికి వచ్చి.. తమ చేతలతో నేసిన దుస్తుల్ని శ్రీరాముడికి అందజేయనున్నట్లు చెబుతున్నారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా గళం విప్పిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఫర్హత్ నఖ్వీ ఆధ్వర్యంలో మహిళలు అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. మేరా హక్ ఫౌండేషన్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఫర్హత్ నఖ్వీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముస్లిం మహిళలు రామ మందిర నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. నిధులను సేకరిస్తున్నారు. యూపీలోని బరేలీ.. బదౌన్.. రాంపూర్.. మొరాదాబాద్.. మీరట్.. ప్రయాగ్ రాజ్ తో సహా 30 జిల్లాల్లో మహిళల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. తాము సేకరించిన నిధులను రామమందిర ట్రస్టుకు అప్పగిస్తామని పేర్కొంటున్నారు.
ట్రస్టు నుంచి తమకు అనుమతి లభిస్తే.. ప్రతి ఏడాది తమ చేతుల మీదుగా శ్రీరాముల వారికి దుస్తుల్ని సిద్ధం చేస్తామన్నారు. ఈ మహిళలు తమ ఊళ్లలో జరీ జర్దోసీ పని చేస్తుంటారు.ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం యూపీలోని వేలాది మంది ముస్లింలు విరాళాలు అందజేశారు. ప్రపంచంలోని మరే దేశంలో లేని ఒక విలక్షణత భారత్ లో మాత్రమే ఉంటుందన్న విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.