ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక పథకంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పేరుకే ఉచితం అని చెప్పిన జగన్ సర్కార్ ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ రేటు భారీగా పెంచేసింది. ఈ క్రమంలోనే పాత ఇసుక పాలసీని రద్దు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం సరికొత్త ఇసుక పాలసీని తెచ్చింది. అంతేకాదు, గత ప్రభుత్వం రీచ్ ల నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాజాగా చంద్రబాబు సర్కార్ రీచ్ ల దగ్గరి నుంచి ట్రాక్టర్లలో ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లవచ్చని తీపి కబురు చెప్పింది.
ఈ ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం ఎడ్డ బండ్లకు మాత్రమే రీచ్ ల నుంచి ఇసుక తీసుకువెళ్లే చాన్స్ ఉంది. కానీ, తాజాగా ట్రాక్టర్లలో కూడా ఇసుకను తీసుకెళ్లే అవకాశం కల్పిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కేవలం స్థానిక అవసరాల కోసం మాత్రమే ట్రాక్టర్లలో ఉచిత ఇసుక తీసుకువెళ్లాలని మీనా ఉత్వర్వుల్లో స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే సీఎం చంద్రబాబు ఆదేశా ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఉచిత ఇసుక విధానంపై ఫిర్యాదులు రావడంతో వాటిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 10 రోజుల్లో మార్పు రాకుంటే ఉపేక్షించనని, ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకాలని, అన్ని బంధనాలు తొలగించి, రవాణా, తవ్వకం ఛార్జీలు కూడా వీలైనంత తక్కువ ధర ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుక అందించి తీరాలని తేల్చి చెప్పారు. ఆంక్షల పేరిట అధికారులు వేధిస్తున్నారని సీఎం దృష్టికి మంత్రులు తీసుకురాగా..ఇకపై అలా ఉండవద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుకను ట్రాక్టర్లలో తీసుకువెళ్లవచ్చన్న చంద్రబాబు నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు చేతకానిది చంద్రబాబు చేసి చూపించారని అంటున్నారు.