‘ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదు..పార్టీకి పనిచేసే వాళ్ళను వదులుకునేది లేదు’ ..తాజాగా పీసీసీ అధ్యక్షుడు వదిలిన పంచ్ డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. పంచ్ డైలాగులు వదలటంలో రేవంత్ బాగా ఆరితేరిపోయారు. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించిన సందర్భంగా మీడియాతో రేవంత్ మాట్లాడుతు పై డైలాగులు వదిలారు. ఇంతకీ కౌశిక్ ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారు ?
ఎందుకంటే తనకే టీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీచేసే అవకాశం వచ్చిందని ఎవరో మద్దతుదారుడికి చెప్పారట. యూత్ మొత్తం తనకు మద్దతుగా పనిచేయాలని మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో లీకయ్యింది. దాంతో ముందు షోకాజ్ నోటీసు జారీచేసిన పార్టీ వెంటనే బహిష్కరణ వేటు కూడా వేసేసింది. నిజానికి సోషల్ మీడియాలో వినిపించిన ఆడియోను పట్టుకుని షోకాజ్ నోటీసివ్వటం ఏమిటో అర్ధం కావటంలేదు.
సరే ఎలాగూ కౌశిక్ కూడా టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా ఎప్పటుండో జరుగుతున్నదే. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదని రేవంత్ హెచ్చరికే విచిత్రంగా ఉంది. ఇంటి దొంగలను రేవంత్ ఎలా పట్టుకోగలరు ? ఇంటి దొంగలను పట్టుకోవటం అంత వీజీకాదు. పైగా ఇంటిదొంగలు బయటకు రావటానికి రేవంత్ ఈనెలాఖరు వరకే టైం ఇఛ్చారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవటానికి గడువు విధించినట్లు.
ఎవరైనా తాను ఇంటిదొంగను అని తమంతట తాముగా బయటకు వస్తారా ? ఏమిటో రాజకీయాల్లో ఇంతటి అనుభవం ఉన్న రేవంత్ కూడా ఇలా క్యామిడి చేస్తారని అనుకోలేదు. కాంగ్రెస్ లో కేసీయార్ కోవర్టులు చాలామంది ఉన్నారనే ప్రచారం ఎప్పటినుండో వినిసిస్తున్నదే. పంచ్ డైలాగులు వేయటం మానేసి ముందు పార్టీలోని సీనియర్లందరినీ కలుపుకునే వెళ్ళేందుకు ప్రయత్నించాలి.
నిజానికి ఇపుడు పార్టీ వదిలేసి వెళ్ళిపోయిన కౌశిక్ గట్టి నేతే. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి 60 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఎటూ కౌశిక్ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి కొత్త అభ్యర్ధిని వెతకాల్సిందే. కాబట్టి అభ్యర్ధి విషయంలో రేవంత్ జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.