రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, వర్షాల కారణంగా.. పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగకుండా కృషి చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాలు కూడా.. ఆపన్నులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో సినీ పరిశ్రమ కూడా కదిలింది. ఇప్పటి వరకు హీరోలు, నిర్మాణ సంస్థలు మాత్రమే విరాళాలు ఇవ్వగా.. ఇప్పుడు తెలుగు చిత్ర సీమలోని అన్ని విభాగాలు.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు.
ఆర్థికంగా సాయం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు. ఈ క్రమంలో వస్తు సాయం కూడా చేయనునట్టు వివరించారు. ఈ క్రమంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సాయం అందిస్తామన్నారు. అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల దగ్గర.. విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. అదేవిధంగా దుస్తులు, వంట పాత్రలు.. ఇతర సామాగ్రిని కూడా సేకరిస్తామని.. వాటిని బాధిత ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేస్తామని అన్నారు.
రుణం తీరనిది: రాఘవేంద్రరావు
చిత్ర పరిశ్రమకు సంబంధించి.. తాము ఇంత బాగున్నామంటే.. దీనికి కారణం.. తెలుగు ప్రజలేనని దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. తాము చేసే సాయం ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు వారి రుణం తీరనిదని.. విపత్తుల సమయంలో సాయం చేయడం తెలుగు సినీ రంగం బాధ్యతని చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. అన్ని యూనియన్లతో మాట్లాడి ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు ఇచ్చేలా చూస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధితులను ఆదుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఫిల్మ్ చాంబర్ సాయం.. ఇదీ..
2 తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు
నిర్మాతల మండలి రెండు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు
ఫిల్మ్ ఫెడరేషన్ సాయం చెరో రూ.5 లక్షలు