కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు చెందిన కన్నడ చిత్ర నిర్మాత శంకర్ గౌడకు డ్రగ్స్ కేసులో నోటీసులు రావడం టాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిర్మాతతో తనీష్ కు సంబంధాలున్నాయని, అందుకే తనీష్ కు కూడా నోటీసులు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఆ కథనాలను ఖండించిన తనీష్… ఆ కేసుకు సంబంధించిన వివరాల గురించి అడిగేందుకు మాత్రమే ఆ నోటీసులు ఇచ్చారని వివరణ ఇచ్చారు.
ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకునేలోపే తాజాగా మరోసారి ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన కొందరి పేర్లతోపాటు తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తలు, ఎమ్మెల్యేల పేర్లు వెల్లడైనట్టు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో పబ్ లు హోటల్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్తలు రతన్ రెడ్డి, కలహర్ రెడ్డిలకు ఈ కేసుతో సంబంధాలున్నాయని, ఈ క్రమంలోనే ఆ ఇద్దరికి పోలీసులు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.
మార్చి 30న వారిని విచారణకు రావాలని ఆదేశించగా వారు హాజరు కాలేదని తెలుస్తోంది. శంకర్ గౌడ కుమార్తె బర్త్ డే పార్టీలో హైదరాబాద్ వ్యాపారి సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డిలతో పాటు తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే, శ్రీను రెడ్డి అనే మరో వ్యక్తి పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ కన్నడ స్టార్ కు చెందిన హోటల్ లో జరిగే పార్టీలకు రతన్, కలహర్ లు హైదరాబాద్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను తీసుకుని వస్తుండేవారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై తెలంగాణ పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.