టాలీవుడ్లో మళ్లీ పూర్వపు రోజులను చూస్తున్నాం. కరోనా టైంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజై బాగానే సందడి, వేడి కనిపించింది. కానీ మామూలుగా అయితే ఈ రెండు నెలల్ని అన్సీజన్గా పరిగణిస్తారు. చెప్పుకోదగ్గ రిలీజ్లు ఉండవు. ఉన్నా సరైన వసూళ్లు ఉండవు. సంక్రాంతి తర్వాత ఈ ఏడాది చాలా వరకు బాక్సాఫీస్ వెలవెలబోయింది.
రైటర్ పద్మభూషణ్, సార్, బలగం లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ప్రబావం చూపాయి. మిగతా సినిమాలేవీ అంచనాలను అందుకోలేకపోయాయి. మార్చి తొలి వారంలో ‘బలగం’ రిలీజయ్యాక తర్వాతి వారం చెప్పుకోదగ్గ సినిమా ఏదీ విడుదల కాలేదు. ఇక ఈ వారం మాత్రం రెండు ప్రత్యేకమైన సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అవే.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, డబ్బింగ్ మూవీ ‘కబ్జా’.
దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న అవసరాల శ్రీనివాస్.. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ లాంటి మంచి సినిమాల తర్వాత ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఈ సినిమా పాటలు, ఇతర ప్రోమోలు చాలా ఆహ్లాదంగా కనిపించిన క్లాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగించాయి. కాకపోతే అన్ సీజన్ వల్లో ఏమో.. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో లేవు. కానీ సినిమాకు టాక్ బాగుంటే ఆటోమేటిగ్గా మంచి ఆక్యుపెన్సీలు ఉంటాయని ఆశిస్తున్నారు.
మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఆదరిస్తారనే అంచనాలున్నాయి. ఇక ఉపేంద్ర సినిమా ‘కబ్జ’ టీజర్, ట్రైలర్లతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ ‘కేజీఎఫ్’తో మరీ పోలిక ఎక్కువ ఉండటం వల్ల దీనికీ ప్రి రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. దీనికి కూడా టాక్ కీలకంగా మారింది. మాస్ ప్రేక్షకుల ఆదరణతో సినిమా మంచి ఫలితాన్నే అందుకుంటుందనే ఆశతో ఉన్నారు. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా సత్తా చాటితే వేసవి సీజన్ కొంచెం ముందే మొదలైనట్లు అవుతుంది.