ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సినీ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుంది. టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం నో చెబుతుండడంతో పెద్ద సినిమాలు విడుదల అవుతాయా? వాయిదా పడతాయా అనే సందిగ్ధత నెలకొంది. కొత్తగా నియామకమైన మా కార్యవర్గం 100 రోజులు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోకపోవడం కూడా సమస్య సాగతీతకు కారణంగా తెలుస్తోంది.
కరోనాతో కకావికలం..
అప్పటి వరకు మూడు పవ్వులు, ఆరు కాయలుగా విరజిల్లిన తెలుగు సినీ పరిశ్రమ కరోనా కారణంగా సంక్షోభంలో కూరుకుపోయింది. కొవిడ్ 1, 2 వేవ్‌లు సినీ పరిశ్రమను తీవ్రంగా నష్టపరిచాయి. కరోనా తర్వాత థియేటర్లు మెల్లమెల్లగా తెరుచుకున్నా జనాలు ఆసక్తి చూపలేదు. ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు విడుదల అయ్యి జనాలు క్రమంగా థియేటర్ల బాట పడుతుండడంతో అందరిలో ఆశలు మొదలయ్యాయి.
దెబ్బతీస్తున్న ఓటీటీ..!
చిన్న థియేటర్లను ఆన్లైన్ ప్లాట్ ఫామ్ దెబ్బతీస్తోంది. కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లని ప్రేక్షకులు చాలా మంది ఇప్పుడు ఓటీటీలో సినిమా చూడడానికి అలవాటు పడ్డారు. థియేటర్లు మూతబడడానికి ఇది కూడా ఒక కారణం. థియేటర్లలో విడుదల కావాల్సిన వెంకటేశ్ సినిమాలు నారప్ప, దృశ్యం-2 సినిమాలు, నాని టక్ జగదీశ్ సినిమా ఓటీటీలో విడుదల కావడమే మారిన ప్రేక్షకుడి అభిరుచిని తెలియజేస్తోంది.
ఆందోళన పరుస్తున్న ప్రభుత్వ నిర్ణయం..
రోజుకు 4 ఆటలే ఆడించాలని.. రూ.100కు మించి టికెట్ ధర పెంచొద్దని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. పెద్ద థియేటర్లకు రూ.100 అయినా పర్వాలేదని.. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20, 30 రూపాయల టికెట్ గిట్టుబాటు కాదని.. దాని బదులు ఓటీటీకి వెళ్లడమే ఉత్తమమని నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇటీవల ప్రకటించారు. ఒక రకంగా ఇది ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసేలా ఉంది.
ప్రభుత్వం ఆలోచన మరోలా..!
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కువ డబ్బులు రాబట్టడానికి సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ఒకే రోజు అత్యధిక షోలు వేసుకుంటున్నారని.. బెనిఫిట్ షోల రూపంలో దోపిడీకి పాల్పడుతున్నారని ప్రభుత్వ భావనగా ఉంది. వీటిని నియంత్రించి ప్రేక్షకులపై టికెట్ ధరల భారం పడకుండా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని ప్రభుత్వ చెబుతోంది.
అయితే సినీ ప్రముఖులు ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో థియేటర్లకు జనాలు రావడం మానేశారని.. టికెట్ రేట్లు తగ్గితే నిర్మాతలకు మరింత నష్టమని.. దాని బదులు థియేటర్లు మూసుకోవడమే ఉత్తతమనే భావనలో ఉన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని టాలీవుడ్ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. నూతన మా కార్యవర్గం ఈ విషయంలో ఎలా ముందుకెళుతుందో వేచి చూడాలి.