తిలక్ వర్మ.. కొన్ని నెలలుగా భారత క్రికెట్లో చర్చనీయాంశం అవుతున్న పేరిది. ఈ కుర్రాడి వయసు 20 ఏళ్లే. 18 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ జట్టు ముంబయి ఇండియన్స్‌లో అవకాశం దక్కించుకుని గత సీజన్లో అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ హైదరాబాద్ కుర్రాడు.. ఈ ఏడాది వరుసగా రెండో సీజన్లోనూ సత్తా చాటాడు. ఐపీఎల్లో అతడి ప్రదర్శన చూశాక తనను భారత జట్టులోకి తీసుకోవాలని మాజీ కోచ్ రవిశాస్త్రి సహా చాలామంది అభిప్రాయపడ్డారు.
ఆ డిమాండ్‌కు తగ్గట్లే ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. తొలి సిరీస్‌లోనే అదరగొడుతూ 5 మ్యాచ్‌ల్లో 173 పరుగులు చేశాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో తిలక్‌కు అవకాశం కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ దిశగా మరో అడుగు పడింది. ప్రపంచకప్ ముంగిట జరిగే ఆసియా కప్‌కు భారత వన్డే జట్టులో స్థానం సంపాదించాడు తిలక్.
ఆసియా కప్‌కు ఎంపికయ్యాడంటే వన్డే ప్రపంచకప్‌కు కూడా ఛాన్స్ అందుకోవడానికి మెండుగానే అవకాశాలు ఉన్నట్లే. ఆసియా కప్ కోసం మొత్తం 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు భారత సెలక్టర్లు. ఇందులో ఇద్దరి తగ్గించి ప్రపంచకప్‌కు జట్టును వచ్చే వారం ప్రకటిస్తారు. గాయాల కారణంగా కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా ఆసియా కప్‌కు ఎంపికయ్యారు. ఐతే వీరి ఫిట్నెస్ మీద ఇంకా సందేహాలున్నాయి. వీళ్లిద్దరిలో ఒకరు పూర్తి ఫిట్నెస్ సాధించకపోయినా తిలక్‌కు ఛాన్స్ ఉంటుంది.
ఆసియా కప్‌లో ఆడి సత్తా చాటాడంటే మరో ఆటగాడిని పక్కన పెట్టి అయినా తిలక్‌ను ప్రపంచకప్ ఆడింవచ్చు. అదే జరిగితే భారత క్రికెట్లో తిలక్ అంత వేగంగా కెరీర్లో పురోగతి సాధించిన ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తారు. వన్డే ప్రపంచకప్ అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.