ఏపీ సీఎం జగన్‌ను ప్రపంచ స్థాయిలో అందరూ కొనియాడుతున్నారని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయని చెప్పుకొంటున్న వైసీపీ నాయకులకు, మంత్రులకు ఊహించని షాక్ ఇది! పైగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బూజు పట్టిన విధానాలను అనుసరించారని విమర్శించే వారికి పెద్ద చెంప పెట్టులాంటి ఘటన ఇది!! విషయంలోకి వెళ్తే.. ప్రపంచ స్థాయి ఎంటర్ప్రెన్యూర్ సదస్సు మంగళవారం నుంచి ప్రారంభమైంది. `వరల్డ్ లార్జెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2020` పేరిట ఈ సదస్సును ఈ నెల 8వ తారీకు నుంచి 10వ తారీకు వరకు మొత్తం మూడు రోజులు నిర్వహించనున్నారు.
ఇది.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది భారీ పెట్టుబడిదారులను ఆకర్షించే కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 20 వేల మంది ఎంటర్‌ప్రెన్యూర్స్, 200 మంది భారీ పెట్టుబడిదారులు, 300 మంది ప్రముఖులు పాల్గొననున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం ఆన్లైన్ మాధ్యమంలో సాగినా.. దాదాపు 25కుపైగా దేశాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. దీనిని బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారో అర్ధమవుతోంది. ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి కేవలం ఒకే ఒక్కరికి అవకాశం దక్కింది. అది కూడా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రమే దక్కడం విశేషం.
ఇక, ఈ సదస్సులో తెలంగాణ నుంచి ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారు. ఇక, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఉపరాష్ట్రపతివెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు కూడా ఆహ్వానం అందింది. ఇక, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ సహా వివిధ రంగాలకు చెందిన మేధావులు.. జాన్ చాంబర్స్(సీఈవో జేసీ2 వెంచెర్స్), గౌతం అదానీ(చైర్మన్ అదానీ గ్రూప్), జెస్సీ థాపర్(హోలోజెన్ వెంచెర్స్ బోర్డ్ మెంబర్), కిరణ్ మజుందార్(బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్, ఎండీ), కునాల్ కపూర్(నటుడు), అభిజిత్ బెనర్జీ(ఎకనమిస్ట్), సద్గురు వాస్దేవ్, శ్రీశ్రీ రవిశంకర్, నారాయణమూర్తి(ఇన్ఫోసిస్ కో ఫౌండర్) వంటి మేధావులకు ఈ సదస్సులో చోటు లభించింది.