ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ధరలపై ఓ కమిటీ నియమించింది. ఈ రోజు భేటీ అయిన కమిటీ…తొలి విడత చర్చలను ముగించింది. అయితే, టికెట్ ధరలతోపాటు పలు అంశాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి టాలీవుడ్ ప్రతినిధులు తీసుకువెళ్లారు. సీ క్లాస్ సెంటర్లలో టిక్కెట్ రేట్లు తగ్గించడంవల్ల థియేటర్లు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, వారి సమస్యలు విన్న ప్రభుత్వ ప్రతినిధులు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి పూర్తి ప్రతిపాదనలతో రావాలని అధికారులు సూచించి సమావేశాన్ని ముగించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కమిటీ తాజా నిర్ణయంతో జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి పెద్ద షాక్ తగిలినట్లయింది.
కమిటీ నిర్ణయం తమ సినిమా విడుదలకు ముందు వెలువడుతుందని భావించిన చిత్ర నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం లేకపోవడంతో…ఉన్న ధరలతోనే కలెక్షన్లను సాధించడం కష్టతరంగా మారుతుంది. కమిటీ రెండో సమావేశంలో నిర్ణయం తీసుకున్నా….దానిపై ప్రభుత్వం ప్రకటన చేయడానికి మరింత సమయం పట్టవచ్చని అనుకుంటున్నారు.
ఏపీలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీరరించింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం టికెట్ ధరలను తెలంగాణ ఫిలించాంబర్ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.175, మల్టీప్లెక్స్ ల్లో రూ.295గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశామని వెల్లడించింది. చిత్రం విడుదలైన 2 వారాల వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత తగ్గుతాయని చెప్పింది.
అయితే, ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తున్నట్టు తెలిసిందని, వారికీ ఫోన్ ద్వారా హితవు పలికామని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. చిన్న సినిమాల టికెట్ రేట్లు తక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు.