ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినిమా పరిశ్రమ ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసే క్రమంలో దశాబ్దం కిందటి జీవోను చూపించి మరీ 5 రూపాయల స్థాయికి టికెట్ల రేట్లను తగ్గించేయడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. పేదవాడు సినిమా చూడొద్దా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు.. తర్వాత ఇండస్ట్రీ పెద్దలు శరణుజొచ్చాక నాన్చి నాన్చి చివరికి రేట్లు పెంచారు. పూర్వం కంటే కూడా కొద్దిగా రేట్లు పెరిగాయి.
మరి పేదవాళ్లకు సినిమా వినోదం చౌకగా అందించాలన్న సంకల్పం తర్వాత ఏమైందో తెలియదు. తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ల సినిమాలను టార్గెట్ చేయడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారడంతో సినీ జనాలు ఎన్నడూ లేని విధంగా ఆందోళనకు గురయ్యారు. టికెట్ల రేట్ల గురించి మాట్లాడినందుకు మధ్యలో నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’కి కూడా ఇబ్బందులు తప్పలేదు.
ఐతే ఏడాది ముందు వరకు ఇండస్ట్రీ జనాలను ఇలా భయపెట్టడంలో వైసీపీ సర్కారు విజయవంతం అయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా అదే పనిగా సినిమాలను టార్గెట్ చేస్తే అది జగన్ సర్కారుకు కచ్చితంగా నష్టం చేసేదే. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ రిలీజైంది. మామూలుగానే పవన్ సినిమాలను టార్గెట్ చేస్తారు. అందులోనూ ఆ సినిమాలో వైసీపీ నేతల మీద పంచులు కూడా ఉన్నాయి. నిర్మాతలు తమకు తాముగా రేట్ల పెంపు వద్దని వెనక్కి తగ్గడంతో ప్రభుత్వం వైపు నుంచి ఆ చిత్రాన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేకపోయింది.
ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి జగన్ సర్కారుకు గట్టిగా తగిలేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నేతలు ఆయన మీద మాటల దాడికి దిగారు. అంతటితో ఆగకుండా చిరు సినిమా ‘భోళా శంకర్’ను టార్గెట్ చేస్తారేమో అనిపిస్తోంది. ఈ సినిమాకు స్వల్పంగా రేట్లు పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకోగా.. అది పెండింగ్లో ఉండిపోయింది. ‘వాల్తేరు వీరయ్య’కు వారం ముందే అనుమతులు వచ్చేశాయి. ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు కూడా వేసుకున్నారు. కానీ ‘భోళా శంకర్’ విషయంలో సందిగ్ధత నెలకొంది. విడుదలకు రెండు రోజులు కూడా సమయం లేకపోయినా.. ఇంకా కూడా ఆంధ్రాలో మెజారిటీ సిటీలు, టౌన్లలో బుకింగ్స్ మొదలు కాలేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.