ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్ల తగ్గింపుపై హీరో నానికి, మంత్రులకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నానికి పలువురు బాసటగా నిలుస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగానే వైసీపీ నేతలుకు, జగన్ కు పుండు మీద కారం చల్లినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫారసుల ప్రకారమే టికెట్ ధరలు పెంచామని ప్రభుత్వం తెలిపింది. ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో అయితే 100 నుంచి 250 రూపాయల వరకు, మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు. ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు కన్వీనియన్స్ రుసుం, జీఎస్టీ వసూలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది.
టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ తెలంగాణలో థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో థియేటర్లలో టికెట్ ధరలను నిర్ణయించేందుకు అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. టాలీవుడ్ ప్రముఖులతో ఆ కమిటీ చర్చలు జరిపి కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో, జగన్ సర్కార్ పై జనాల్లో, సినీ వర్గాల్లో వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ఏపీలో కనీస టికెట్ ధర 5 రూపాయలుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరలను తగ్గించడమే ప్రజా సంక్షేమమంటోన్న జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా…టికెట్ ధరల విషయంలో ఫస్ట్ టైం జగన్ కు మండే నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని చర్చ జరుగుతోంది.