భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామంటూ.. బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్‌కు ఈ కాల్ వచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి.
ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తు తం పోలీసులు ఈ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఆయన నివాసం అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కనిపించడం కలకలం రేపింది.
కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచారు. అనుమానా స్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమైంది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంబానీ ఇంటి అడ్రస్ అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీరిద్దరు ఓ బ్యాగ్‌ను వెంటబెట్టుకుని ఉన్నారని డ్రైవర్ తెలిపాడని ముంబయి పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో అంటిలియా వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే.. ఈ బెదిరింపు కాల్స్‌పై అంబానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.