తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆ యన ఏ ఉద్దేశంతో ఆమాట అన్నారో తెలియదు కానీ.. రాజకీయంగా మాత్రం సదరు వ్యాఖ్యలు తీవ్ర కలక లం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈ రాష్ట్రానికి సారధి కాబోతున్నారు.. అని వ్యాఖ్యానించారు.. అంటే… కాబోయే సీఎం పవనేనని సోము చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. ప్రస్తుతం యువ నాయకుడుగా వైసీపీ అధినేత జగన్ ప్రచారంలో ఉన్నారు.
ఆయన ఫొటోలను కూడా చాలా అందంగా తీర్చిదిద్ది ఫ్లెక్సీలపై వయసు అస్సలు కనిపించకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే.. రాష్ట్రానికి యువ నాయకుడు ఉంటే.. బెటర్ అనే సందేశాన్ని వారు ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మాత్రం చంద్రబాబు మాత్రమే నాయకుడిగా ఉన్నారు. రేపు పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆయనే సీఎం అవుతారు.
దీనిని దృష్టిలో ఉంచుకునే వైసీపీ నాయకులు `యువ` పాలిటిక్స్‌ను బలంగా తీసుకువెళ్తున్నారు. బహుశ దీనిని గుర్తించే సోము వీర్రాజు.. పవన్ ను సీఎంగా ప్రొజెక్టు చేసే పనిపెట్టుకున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ వయసుతో నిమిత్తం లేకుండా.. ఆయనను ఒక హీరోగా.,. యువ నేతగా ప్రజలు ఆదరిస్తున్నారు. అంటే… వచ్చే ఎన్నికల నాటికి ఈయనను సీఎం అబ్యర్థిగా ప్రకటించడం ద్వారా.. యవతను జగన్ నుంచి మళ్లించాలనేది సోము వ్యూహంగా కనిపిస్తోంది.
సోము ఎప్పుడైతే… ఈ వ్యాఖ్య చేశారో.. జనసేన నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. పైకి వారు దీనిపై ఎలాంటి ప్రకటన వెల్లడించకపోయినా.. ఖండించకపోయినా.. పవన్ సీఎం అయితే.. బెటరనే ఉద్దేశంతో ఉన్నారు. ఇక, వైసీపీలోనూ సోము ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేక పోయారు. పైగా తనను సీఎం సీఎం అంటూ.. కామెంట్లు చేసిన యువతను హెచ్చరించా రు.. కేవలం సీఎం సీటే తనకు ముఖ్యం కాదన్నారు.
కానీ, ఇప్పుడు సోము వ్యాఖ్యల తర్వాత.. ఇలాంటి కామెంట్లు జనసేన నుంచి రాలేదు. అంటే.. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో వైసీపీకి ఒక పెద్ద యువ నాయకుడితో పోటీ తప్పదనే భావన వ్యక్తమవుతోంది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. సాధారణ అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తే.. ఉండే రియాక్షన్ కంటే కూడా .. సీఎం అభ్యర్థిగా పవన్ ఉంటే.. ఆ రియాక్షన్ వేరుగా ఉంటుందని.. ఇది వైసీపీకి సెగ పెడుతుందని అనేవారు పెరుగుతుండడం గమనార్హం.