దొంగతనము తప్పురా.. దోపిడీలు ముప్పురా.. అన్నారు!! నిజమే. అయినా.. వాటిని చాలా మంది మానడం లేదు. ఇప్పుడు కాలం మారింది. కాలాని అనుగుణంగా దొంగతనం చేసే పద్ధతి కూడా మారిపోయింది. ఒకప్పటి దొంగలను కనీసం గుర్తించేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు సైబర్ దొంగ లను గుర్తించడమూ కష్టమే.. పట్టుకోవడమూ మరింత కష్టమే. నొప్పి తెలియకుండా దోచేస్తున్న సైబర్ దొంగలు ప్రపంచానికి సవాలుగా మారిన విషయమూ తెలిసిందే. అంతేకాదు.. ఇప్పుడు దొంగతనాన్ని ఒక హాబీగా పెట్టుకున్న వారు కూడా కనిపిస్తున్నారు.
ఇటీవల హాంకాంగ్‌లో ఒక సరికొత్త విషయం వెలుగు చూసింది. దొంగలకు శిక్షణ ఇచ్చే కాలేజీని పోలీసులు గుర్తించారు. వారు గుర్తించనంత కాలం అక్కడ దొంగలు తయారయ్యారన్న మాటే కదా!! ఇక్కడ చేరిన వారంతా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాల్లో ఆరితేరిపోయి.. మెలితిరిగిన చోరులుగా వృత్తి నైపుణ్యంలో దూసుకుపోతున్నారట! కొన్ని రోజుల కిందట విశాఖపట్నం పోలీసు కమిషనర్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలా దొంగతనం చేసేవారికి.. మనసు, మమత.. వంటివి మచ్చుకైనా ఉండవు కదా! ఉండవు!!
కానీ, తాజాగా జరిగిన ఓ దొంగతనంలో కిక్కిచ్చే విషయం తెరమీదికి వచ్చింది. మహారాష్ట్రలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ కావాల్సిన వస్తువులను మూట గట్టుకుని వెళ్లిపోయాడు. అయితే.. తర్వాత రోజు కూడా.. యథాలాపంగా.. మళ్లీ అదే ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఈ సమయంలో గోడపై ఉన్న ఫొటో చూసి.. ఆశ్చర్యపోయాడు. అంతేకాదు.. చెమర్చిన కళ్లతో క్షమాపణలు కోరుతూ.. ఓ లేఖ రాసి.. ముందు రోజు దొంగతనం చేసిన వస్తువులను కూడా తీసుకువచ్చి.. అక్కడ పెట్టి వెళ్లిపోయాడు. ఈ చిత్రమైన ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొందరు `మంచి దొంగ` అని కితాబిస్తుంటే.. మరికొందరు.. ఇక నుంచైనా మారవోయి! అని సలహాలు ఇస్తున్నారు.
ఏం జరిగింది?
మహరాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ప్రముఖ మరాఠీ కవి నారాయణసువే ఇంట్లో ఆయన కుమార్తె సుజాత కుటుంబం నివసిస్తోంది. అయితే.. వారు ఓ పనిపై వేరే ప్రాంతానికి వెళ్తూ.. ఇంటికి తాళం వేశారు. ఆదివారం.. ఓ దొంగ ఈ ఇంట్లోకి ప్రవేశించి ఎల్ఈడీ టీవీతో పాటు టీపాయ్‌పై ఉన్న కొన్ని వస్తువులను తీసుకుపోయాడు. మరుసటి రోజు కూడా.. ఇదే పనిపై వస్తూ.. ఈ ఇంట్లోకే ప్రవేశించాడు. రెండు రోజులుగా ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించి.. లైట్లు వేశాడు. ఓ గోడమీద.. కవి నారాయణ్ ఫోటో సహా ఆయనకు వచ్చిన అవార్డుల ఫొటోలు కనిపించాయి.
దీంతో ఆ దొంగ.. అయ్యో మా మాస్టారిల్లు అంటూ.. కళ్లు చెమర్చాడు. ఆ వెంటనే దొంగతనం మానేసి మరీ.. ముందు రోజులు తీసుకుపోయిన వస్తువులను కూడా తీసుకువ చ్చి.. ఎక్కడివక్కడ సర్దేశాడు. అంతేకాదు.. “ మా మాస్టారు.. గొప్ప సాహితీవేత్త ఇంట్లో దొంగతనం చేసినందుకు క్షమించాలి“ అని పేర్కొంటూ.. ఓ పత్రాన్ని గోడకు అతికించి వెళ్లిపోయాడు. ఇక, మంగళవారం ఇంటికి వచ్చిన సుజాత కుటుంబం ఆ లేఖను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ.. సంగతి!!