కొద్ది రోజులుగా మే 2 తర్వాత ఎప్పుడైనా సరే.. లాక్ డౌన్ విధిస్తారన్న మాట తరచూ వినిపిస్తోంది. ఇక.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఏపీలో కరోనా కేసులు ఐదు అంకెలు దాటితే.. తెలంగాణలో ఏడున్నర వేల కేసులకు వచ్చేసింది. హైదరాబాద్ మహానగరంలో వెయ్యి నుంచి పదిహేను వందల కేసుల వరకు అది కూడా ఒక్కరోజుకే వచ్చేయటం చూస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఖాయమన్న మాట వినిపిస్తోంది.
ఎంతో అవసరం ఉంటే తప్పించి ఇంటి నుంచి బయటకు రావొద్దని ఎంత చెప్పినప్పటికి.. చాలామందికి ఇదేమీ పట్టటం లేదు.
రాత్రి 9 గంటల తర్వాత కర్ఫ్యూ విధించినప్పటికి.. దాని వల్ల ప్రయోజనం అంతంతమాత్రమే. కర్ఫ్యూ కారణంగా షాపులు మూసి ఉంచటమే తప్పించి లాభం ఉండదు. ఎందుకంటే.. కమర్షియల్.. నాన్ కమర్షియల్ వాహనాలు తిరిగే వెసులుబాటు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాల సంఖ్య తక్కువగా ఉండటమే కానీ.. అసలంటూ లేకుండా లేని పరిస్థితి.
మరోవైపు.. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవటం.. ఈ నెల చివరి నాటికి భారీగా నమోదు అవుతాయని.. మే 15 లోపు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇలాంటి వేళ.. ఎవరికి వారు.. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కు మించిన మార్గం కనిపించని పరిస్థితి. కనీసం వారం నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఎందుకంటే.. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ చెయిన్ ను బ్రేక్ చేసేందుకు ప్రభుత్వాలు వెనువెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అయితే ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా లేవన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కిందామీదా పడుతున్నాయి. పది రోజుల పాటు విధించే లాక్ డౌన్ ప్రభావం తక్కువలో తక్కువ నెలన్నర వరకు ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. ఏమైనా సరే లాక్ డౌన్ దిశగా అడుగులు వేసే సాహసం చేయటం లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించటం.. అనవసరమైన రద్దీని అధిగమించేలా చర్యలు తీసుకోవటం.. రోడ్ల మీద ఉమ్మువేయటం..మాస్కులు పెట్టుకోకుండా ఉండటం.. భౌతికదూరం.. శానిటైజ్ చేసే విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
రాజకీయ ప్రయోజనాల్ని పక్కన పెట్టేసి.. ఎవరికి వారు ప్రజల ఆరోగ్యమే ప్రధానాంశంగా తీసుకుంటే తప్పించి.. పరిస్థితుల్లో మార్పురాదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఆ దిశగా పాలకుల ఆలోచన ఉంటుందా? అన్నది ప్రశ్న.