మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీతో పాటు జనసేన, టీడీపీలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మా పార్టీ ఇన్ని సీట్లు గెలుచుకుంటుంది అంటే మా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అంటూ ఎవరికి వారే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక, కొన్ని పార్టీలు తమ సొంత సర్వేలు చేసుకుంటే కొన్ని మీడియా సంస్థలు దేశవ్యాప్తంగా సర్వే లు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా టైమ్స్ నౌ చేపట్టిన సర్వే ఫలితాలలో మరోసారి మోడీకే దేశ ప్రజలు పట్టం కట్టబోతున్నారని వెల్లడైంది. ఎన్డీఏ కూటమికి 296 నుంచి 326 సీట్లు వస్తాయని ఆ సర్వే వెల్లడించింది. ఇక, విపక్షాల ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు వస్తాయని తెలిపింది. ఏపీ విషయానికి వస్తే వైసీపీకి 24 నుంచి 25 మంది ఎంపీలు వస్తారని సర్వేలో వెల్లడైంది. ఏపీలో టీడీపీ, జనసేనల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, ఒక ఎంపీ స్థానానికి పరిమితం కావచ్చని ఆ సర్వే అంచనా వేసింది.
జూన్ 15 నుంచి ఆగస్టు 12వ తేదీల మధ్య ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించినట్టుగా తెలిపింది. అయితే, ఎన్నికలకు మరో నాలుగు, ఐదు నెలలు గడువున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు మారవచ్చని, ఈ సర్వే ఫలితాలు రాబోయే ఎన్నికలలో కూడా రిపీట్ అవుతాయని చెప్పలేము అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తాజా సర్వే తో రాష్ట్రంలో వైసిపి శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన సర్వేలో కూడా తమ పార్టీదే విజయం అని వెల్లడైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.