‘‘ఈ రాజకీయాలు మనకొద్దు…గుడ్ బై చెప్పేసేయండి…’’ ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ తో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి తరచుగా అన్న మాటలు ఇవి. అయినా సరే, రాజకీయాల్లో కొనసాగాలని, తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబుల అడుగు జాడల్లో నడుస్తూ ప్రజాసేవకే జీవితం అంకితం చేయాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. అయితే, చంద్రబాబు అరెస్టు సమయంలో తీవ్రంగా కలత చెందిన బ్రాహ్మణి…ఇక, రాజకీయాలకు స్వస్తి పలకాలని లోకేష్ తో మరోసారి అన్నారు.
అంతలోనే, చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా దాదాపు 45 వేల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం చూసిన బ్రాహ్మణి మనసు మార్చుకున్నారు. రాజకీయాల్లో కొనసాగొద్దు అని లోకేష్ కు ఇంకెప్పుడూ చెప్పలేదు. అమెరికాలో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ అలైన్స్ సినర్జీ సమ్మిట్-2024’’ లో ఈ విషయాన్ని స్వయంగా లోకేష్ వెల్లడించారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో తన అనభవాలను పంచుకున్న సందర్భంగా లోకేష్ పై వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన తమ కుటుంబానికి ఎంతో మనోధైర్యమిచ్చిందని లోకేష్ అన్నారు. చంద్రబాబు గారికి, తమ కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రజల కోసం తాము నిలబడాలని బలంగా నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రజలిచ్చిన ధైర్యంతో, వారు చూపిన ప్రేమతోనే అధికారంలోకి వచ్చి వారికి సేవ చేసుకుంటున్నామని తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని, అందుకే, అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా, చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ హబ్ గా, గుంటూరు, కృష్ణా పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంచి ఎకో సిస్టం ఉన్న విశాఖను ఐటీ రాజధానిగా మారుస్తామని చెప్పారు. రాజకీయ నేతలు, అధికారుల ప్రమేయం లేకుండా, టెక్నాలజీతోనే ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే వీలుందని తెలిపారు. దీనికి తగ్గట్టు వినూత్న విధానాలు రూపొందిస్తున్నామని, రాబోయే 9 నెలల్లో ప్రభుత్వ పని తీరులో ఈ మార్పు ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. టెక్నాలజీతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
https://x.com/i/status/1851526632642609657