మసాజ్ అన్నంతనే గుర్తుకు వచ్చే దేశం థాయ్ లాండ్. ఎవరెన్ని అనుకున్నా.. థాయ్ లాండ్ లో వినోదాలకు కొదవ లేకుండా ఉండటమే కాదు.. సగటు భారతీయులు రిలాక్స్ అయ్యేందుకు ఎంచుకునే దేశాల్లో థాయ్ లాండ్ ఒకటి. తాజాగా ఆ దేశం భారతీయులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పరిమిత కాలానికి సంబంధించిన ఈ శుభవార్త విన్నంతనే.. ఆ దేశానికి ప్రయాణం చేసేందుకు ప్లాన్ వేసుకునేలా ఆఫర్ ఇచ్చింది.
తమ దేశానికి వచ్చే పర్యాటకులకు థాయ్ సర్కారు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. మరి.. ముఖ్యంగా భారతీయులతో పాటు తైవాన్ ప్రజలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. తమ దేశానికి ఈ రెండు దేశాలకు చెందిన ప్రజలు వీసా లేకుండా రావొచ్చని.. వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించినట్లుగా తాజాగా పేర్కొంది. విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అనువుగా ఉండే సీజన్ ను పరిగణలోకి తీసుకున్న ఆ దేశం.. పరిమిత కాలానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి తైవాన్ కు 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించేందుకు వీలుగా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ లిమిటెడ్ ఆఫర్ నవంబరు నుంచి వచ్చే ఏడాది మే వరకు వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా సీజన్ లో 28 మిలియన్ల పర్యాటకుల్ని ఆకర్షించటమే లక్ష్యంగా ఈ దేశం పెట్టుకుంది. పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయంతో బలహీన ఎగుమతుల లోటును అధిగమించే వీలుందని చెబుతున్నారు.
నిజానికి థాయ్ లాండ్ ను ఎక్కువగా చైనా.. మలేషియా.. దక్షిణ కొరియా దేశాల నుంచి ప్రజలు ఎక్కువగా పర్యటిస్తుంటారు. వారి తర్వాత ఎక్కువగా పర్యాటకులు వచ్చేది భారత్ నుంచే. 2019లో రికార్డు స్థాయిలో ఆ దేశానికి వచ్చిన 39 మిలియన్ల పర్యాటకుల్లో.. 11 మిలియన్ల పర్యాటకులు చైనీయులే కావటం గమనార్హం. కరోనా తర్వాత టూరిస్టులు బాగా తగ్గిపోవటంతో.. ఆ దేశం కిందా మీద పడుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పర్యాటకుల్ని ఆకర్షించేందుకు వీలుగా తాజా ప్రకటన చేసినట్లుగా చెబుతున్నారు. థాయ్ లాండ్ కు వెళ్లాలన్న ప్లానింగ్ లో ఉన్న వారు.. వెంటనే ఆ దేశానికి ప్లాన్ చేసుకోవటం మంచిదని చెప్పక తప్పదు.