పాశ్యాత్య సంస్కృతి ప్రభావమో…విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన పోర్న్ ప్రభావమో…లేక సెన్సార్ కట్ లేకుండా ఫింగర్ టిప్స్ తో టచ్ చేసేంత దూరంలో ఉన్న అల్ట్రా మోడర్న్ వెబ్ కంటెంబ్ ప్రభావమో…తెలీదుగానీ…ఈ మధ్య చిన్నారులు మొదలు మహిళలపై లైంగిక దాడులు, రేప్ లు, గ్యాంగ్ రేప్ లు, మర్డర్ లు పెరిగిపోతున్నాయి. పోక్సో చట్టాలతో పాటు కఠిన శిక్షలు విధించేలా చట్టాలు రూపొందించినా, ఎంత మందికి కఠినమైన శిక్షలు విధిస్తున్నా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా సభ్య సమాజం తల దించుకోవాల్సిన మరో గ్యాంగ్ రేప్ ఘటన హైదరాబాద్ లో జరిగింది. హయత్ నగర్ తట్టి అన్నారంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10 రోజుల క్రితం ఆ బాలికకు మాయమాటలు చెప్పి..గ్యాంగ్ రేప్ చేసిన సహ విద్యార్థులు…ఆ వికృత చర్యను వీడియో తీశారు. అంతేకాదు, ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్ లో పెడతామని బాధితురాలిని బెదిరించారు.
ఇక, తాజాగా మరోసారి ఆ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేసి మరోసారి ఆ బాధితురాలిని రేప్ చేశారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. దీంతో, ఈ దారుణం వెలుగులోకి వచ్చి…బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు…బాలికపై అత్యాచారంకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించి విచారణ జరపనున్నారని తెలుస్తోంది.