ఏపీ అధికార పార్టీ వైసీపీ తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే.
ఏకంగా ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలను సైతం మోహరించి.. ఇక్కడ చక్రం తిప్పింది.
ఇక, పోలింగ్ రోజు.. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్ల దందా సాగిందనే ఆరోపణలు వచ్చినా.. వైసీపీలో ఉలుకుపలుకు లేకుండా పోయింది.
ఆధారాలతో సహా టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ దొంగ దందాను బయట పెట్టినా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డిలు బుకాయించారు. ఎదురుదాడి చేశారు.
ఇక, తిరుపతిలో భారీ గెలుపు తమదేనని పేర్కొన్నారు. అంతేకాదు.. ఎక్కడా తాము వెనక్కితగ్గాల్సిన అవ సరం లేదన్నారు.
ప్రజలు తమవెంటే ఉన్నారని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అంత పెద్ద దైర్యం కూడా ఇప్పుడు డిఫెన్స్‌లో పడిపోయింది.
అదేంటంటే.. దొంగ ఓట్ల దందా నేపథ్యంలో ఆధారాలతో సహా బీజేపీ, టీడీపీ తరపున ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు.. రత్న ప్రభ, పనబాక లక్ష్మిలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు.
అయినా.. ఈసీ పట్టించుకోలేదు. దీంతో వారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కూడా జరిగింది.
తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది.
ఫలితాలు ప్రకటించకుండా నిలువరించాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫు న్యాయవాది కోరారు.
అదేసమయంలో.. వేలమంది దొంగ ఓట్లు వేసినట్లు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫు న్యాయవాది తెలిపారు.
ఉప ఎన్నిక రద్దు చేసి రీపోలింగ్‌కు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఈ పరిణామం.. వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.
ఇంకొక్క నాలుగు రోజుల్లో ఫలితం వచ్చేస్తుందని భావిస్తున్న తరుణంలో హైకోర్టులో విచారణ జరగడం.. ఈ నెల 30న మరోసారి విచారణ ఉండడంతో అసలు తీర్పు ఎలా వస్తుందో.. ఏం వస్తుందోనని వైసీపీ నేతలు అల్లాడిపోతుండడం గమనార్హం.