పల్లెల్లో ఎవరు ఓటు ఎవరికి పడుతుందన్నది తెలుసుకోవడం కొంత సులువే. పైగా వేగులు కూడా ఎక్కువే. వీటికి తోడు పంచాయతీ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు ప్రభావం చూపడం, గుర్తుల్లేకపోవడం, మందు ప్రభావం బాగా ఉంటుంది. అయినా కూడా వైసీపీ ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం సాధించలేకపోయింది.
తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే కాబట్టి… వైసీపీకి భయం పట్టుకుంది. మధ్యతరగతి ప్రజలు జగన్ తో ఏమాత్రం సింక్ కాలేకపోతున్నారు. ధరల భారం వారిని వెంటాడుతుంది. జగన్ పెంచిన కరెంటు భారం, ట్యాక్సులు పడేది కూడా వీళ్లపైనే.
పల్లెల్లో ఎవరూ ఏ ట్యాక్స్ కట్టరు. కానీ పట్టణాల్లో ప్రభుత్వాలు మోపే ప్రతి భారం ప్రజలకు తెలుస్తుంటుంది. అందుకే రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు బాగా తక్కువ అని వైసీపీ బెంగ పెట్టుకుంది.
మరోవైపు ఇపుడు మా సత్తా చూపిస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ సంబరపడుతోంది. సొంత నిధులు ఉండే మున్సిపాలిటీల్లో తెలుగుదేశానికి ఓటేస్తే మూసేసిన అన్నా క్యాంటీన్లను తెరిపిస్తాం, వీలైనంతగా స్థానిక పన్నుల భారం తగ్గిస్తాం అంటోంది తెలుగుదేశం. దీనికి తోడు మధ్యతరగతి అండ గట్టిగా ఉండటంతో తెలుగుదేశం ఫుల్ జోష్ తో ఉంది.
తాజాగా మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. దానిని కింద చూడొచ్చు.
ఈ మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ లోకేష్ నారా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. 21 నెలల జగన్ రెడ్డి పాలనలో పట్టణాల అభివృద్ధి శూన్యం. కనీసం రోడ్డు పై గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూసాం. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసాడు, మరో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను నాశనం చేస్తాడు. ఆలోచించి ఓటు వెయ్యండి’’ అంటూ లోకేష్ పిలుపునిచ్చాడు.
మరి గుర్తులతో జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుంది.