తెలంగాణకు చెందిన మానసా వారణాసి తెలుగు వారి పేరు నిలబెట్టింది. తాజాగా జరిగిన వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని మన తెలంగాణ యువతి మానసా దక్కించుకుంది. యూపీకి చెందిన మాన్య సింగ్ ను రన్నరప్ కు పరిమితం చేసిన మానసా మిస్ ఇండియా కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఏర్పడినప్పటికీ జ్యూరీ..మానస వైపే మొగ్గు చూపారు. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ఫినాలేలో మానస విజేతగా నిలిచింది.
అందంతోపాటు అద్భుతమైన చిరునవ్వులు చిందిస్తున్న మానస…జ్యూరీ సభ్యులతోపాటు కోట్లాది మంది మనసులను కొల్లగొట్టి మిస్ ఇండియా కిరీటాన్ని తొడిగించుకుంది. హర్యానాకు చెందిన మానికా శిఖండ్ విఎల్సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020 గా నిలిచింది. ఈ పోటీలకు జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటి నేహా దూఫియా, చిత్రంగాడ సింగ్, పుల్కిత్ సామ్రాట్ ,ప్రఖ్యాత డిజైనర్ ద్వయం ఫాల్గుని , షేన్ పీకాక్ వ్యవహరించారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి 28న ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది.
23ఏళ్ల మానసా వారణాసి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఉన్న మానస….పలు రాష్ట్ర స్థాయి ఫ్యాషన్ షోలలో పాల్గొంది. తాజాగా వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలలోనూ సత్తా చాటింది. మిస్ ఇండియాాగా నిలిచిన మానసను పలువురు అభినందించారు. రాత్రికి రాత్రే మానస సెలబ్రిటీ అయిపోవడంతో…ఆమె పేరు గూగుల్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.