తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో తెలంగాణ నాల్గవ స్థానంలో నిలిచింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ రాకపోకల నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. మొత్తం 38 కేసుల్లో 6 రిస్క్ దేశాల నుంచి వచ్చినవి కాగా, 31 కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారివి. మరొక కేసు కాంటాక్ట్ కేసు.
మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనం సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. మొత్తం 38 కేసుల్లో 12 కేసులు రిస్క్ కేటగిరీలో లేని దేశాల నుంచి వచ్చినవి కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. జనం గుంపులు గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, మరో రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మాదిరిగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని వెల్లడించింది. ఇప్పటికే, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ లు ఆ వేడుకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. న్యూ ఈయర్ సందర్భంగా వచ్చే కోట్ రూపాయల ఆబ్కారీ ఆదాయంపై ఆశలు పెట్టుకున్న కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చిందన్న చర్చ జరుగుతోంది.