జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు, టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వివిధ కేసులలో తీన్మార్ మల్లన్న దాదాపు 74 రోజులపాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. టీఆర్ఎస్ తనను కక్ష సాధింపు ధోరణితో అనేక ఇబ్బందులకు గురి చేసిందని, లేనిపోని కేసులు పెట్టించి జైలుకు పంపిందని మల్లన్న గతంలో ఆరోపించారు.
ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మల్లన్న దూకుడు పెంచారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై 38 కేసులు పెట్టిన కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చడమే తన ధ్యేయమని, బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని శపథం చేశారు.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న మల్లన్న…త్వరలో కొత్త పార్టీ పెడతారన్న టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. ఇకపై కేసీఆర్ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని మల్లన్న శపథం చేయడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కానీ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్మెంట్’ ద్వారా పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయడం తమ విధానం కాదని, ప్రజా చైతన్యం కోసంమే తమ పోరాటమని మల్లన్న చెప్పారు. విద్యావంతులైన బాల్క సుమన్, గ్యాదరి కిషోర్లకు విద్యాశాఖను అప్పగిస్తే బాగుంటుందని, పేదోళ్ల, పెద్దోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదే తమ మూవ్మెంట్ లక్ష్యమని అన్నారు.
అకాల వర్షాలతో రైతులు ఆగమవుతుంటే కేసీఆర్ మాత్రం వ్యవసాయ క్షేత్రం విడిచి బయటకు రావడంలేదని మల్లన్న విమర్శలు గుప్పించారు. యాదాద్రిలో వందల కోట్లు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలివానకే తేలిపోయిందని ఎద్దేవా చేశారు. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్ రెండో వారంలో చేపట్టే ప్రజా పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు.