సీపీఎస్ రద్దు వ్యవహారంలో సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పారని ఉపాధ్యాయులంతా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, వారంతా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నించినా…అవి సఫలం కాలేదు. దీంతో, ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులపై విద్యాశాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ అవసరం లేదని ఉపాధ్యాయులు చెప్పడాన్ని బొత్స ఖండించారు. ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? అని సత్తిబాబు ప్రశ్నించారు. విద్యా రంగంపై ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను తప్పుపట్టే హక్కు ఉపాధ్యాయులకు లేదని తేల్చేశారు. ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భాగమని, కనుక ఉపాధ్యాయులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకే సంస్కరణలు తెచ్చామని, వాటి ఫలితాలు వచ్చేందుకు కాస్త టైం పడుతుందని అన్నారు. ఇక, పాఠశాలల విలీనం విషయంపై విద్యార్థుల తల్లితండ్రులకు అభ్యంతరం లేదని, ఎవరో కుట్రలు చేసి అడ్డుకోవాలని చూస్తున్నారని బొత్స అన్నారు.
పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇస్తున్నామని.. ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత ధరకే అందజేస్తున్నామని, ప్రభుత్వమే ప్రింట్ చేస్తున్నందున కాస్త ఆలస్యం జరుగుతోందని అన్నారు.
దీంతో, బొత్స వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యారంగంపై ఏ మాత్రం అవగాహన లేని బొత్సను ఆ శాఖ మంత్రిని చేస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యారంగానికి సంబంధించిన నిర్ణయాలు ఉపాధ్యాయులకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తాయని, అటువంటి వారి సలహాలు వద్దని చెబుతున్న బొత్స తీసుకునే నిర్ణయాలు పిల్లలకు ఇబ్బందికరంగా మారతాయని అంటున్నారు.