విజయదశమి నాడు చెడుపై మంచి విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని యావత్ దేశ ప్రజలు పండుగను ఘనంగా జరుపుకుంటారు. సీతను అపహరించిన రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే, ఏపీలో చెడు పాలనను దహనం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విజయ దశమిని ఎంచుకున్నారు. జగనాసుర పాలన అంతానికి దసరా నాడు చంద్రబాబు ముహూర్తం పెట్టారు. రాబోయే ఎన్నికలలో టిడిపి గెలుపు తథ్యమని, ఆ గెలుపునకు బాట వేసే పూర్తిస్థాయి మేనిఫెస్టోను దసరా నాడు విడుదల చేయబోతున్నానని చంద్రబాబు ప్రకటించారు.
ఈ ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాశారు. ‘‘బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’’ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ రోజు నుంచి 45 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి 3 కోట్ల మందిని కలవాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. టీడీపీ సైకిల్ గుర్తులో సంక్షేమం ఒక చక్రమని, అభివృద్ధి మరో చక్రమని చంద్రబాబు అన్నారు. ఏపీని వైసీపీ పాలకుల సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. జగన్ ‘భస్మాసుర’ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దోపిడీతో పేదలు మరింత పేదవారిగా మారుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భవిష్యత్తును ఈ సైకో ప్రభుత్వం చీకటిమయం చేసిందని, వారికి వెలుగు చూపేందుకే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పథకాలు ప్రకటించానని అన్నారు. అందుకే, దసరా రోజున ఆ చీకట్లు పారదోలేలా టీడీపీ పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటిస్తానని అన్నారు. ప్రజల ఇళ్ల దగ్గరకు టీడీపీ కార్యకర్తలు వస్తారని, ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.