రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంటుందని తెలిపారు. ప్యాలస్‌లో కూర్చుని పథకాలు అమలు చేస్తామంటే.. డబ్బులు ఇస్తున్నామంటే కుదరదని.. జగన్ ఓటమి తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా ఓడిపోతుందని తేల్చి చెప్పారు. జగన్ పార్టీ మామూలుగా కాదు, భారీ తేడాతో ఓటమి చెందుతుందని ప్రశాంత్ కిషోర్ బల్లగుద్ది మరీ చెప్పడం గమనార్హం.
తాజాగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని, భారీ తేడాతో ఓడిపోతుందని పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉచితాలు అంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదని, ఉద్యోగాల కల్పన, అభివృద్ధిపై సైతం ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నారు. కేవలం పథకాలతో ఓట్లు రాలవని, ప్రజల వద్దకే అన్నీ అందుతున్నాయని చెప్పుకోవడం కాదని అన్నారు.
డెవలప్మెంట్ కోసం ముందడుగు వేయాలని, అది జగన్ కు చేతకాలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. జగన్ చేసిన పెద్ద తప్పు ఇదేనని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మార్పు దిశగానే ప్రజలు ఓట్లేస్తారని తెలిపారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబును ప్రజలు నమ్ముతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో దాంతో ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు.
అంతేకాదు, ప్రస్తుతం రోజులు మారాయని, యువత అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. వారు ఉద్యోగాల కోసం చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ది చెందితే జాబ్స్ వస్తాయని వారు కలలు కన్నారని తెలిపారు. కాగా, ఉచితాలపై మాత్రమే ఫోకస్ చేసిన జగన్ కొన్ని విషయాల్లో మిస్టేక్ చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తుందన్నారు. జగన్ ఒక్కరే ఒక వైపు ఉన్నారన్న సానుభూతి పనిచేయదని తెలిపారు.
కాగా, 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక స్థానాలతో విజయం సాధిస్తారన్న పీకే అంచనా నిజమైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. ఇక, ఇప్పుడు ఆయనే వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పడం గమనార్హం.