ఏపీలో కరోనా కట్టడి చేయడంలో జగన్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ నిర్లక్షంతోనే కేసులు పెరిగిపోయాయని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అయితే, ఈ విమర్శలు పట్టని…జగన్…బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నెల 20న పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు శాసన సభతో పాటు శాసన మండలి సమావేశం కానుంది.
కోవిడ్-19 నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేయాలా లేదా అన్నది ఆ రోజు నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. థూథూ మంత్రంగా నిర్వహించే ఒక రోజు అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు.
6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న కారణంతో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. బడ్జెట్ పై విపులంగా చర్చ జరగాలని, ఒక్కరోజులో అది సాధ్యం కాదని , అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చిలో 900 కరోనా కేసులున్నాయని, అప్పుడెందుకు నిర్వహించలేదని నిలదీశారు.