టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్ లపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నానిపై కేసు పెట్టాలని, చర్యలు తీసుకోవాలని గత మూడు రోజులుగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడం, వారిని పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు విజయవాడలో జరిగిన టీడీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించినట్లు టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ ల ఓటమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ ముగ్గురిని చట్టసభల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆ త్రీ ఇడియట్స్ ఓటమే టీడీపీ నేతల టార్గెట్ అని చెప్పారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడి, దేవినేని అవినాశ్ రాజకీయంగా నాశనం అయ్యారని ఆయన అన్నారు.
అయితే, ఇంతటి కీలకమైన సమావేశానికి టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కానీ, కేశినేని నాని ఢిల్లీలో సమావేశాలతో బిజీగా ఉన్నారని, అందుకే, నేడు ఇక్కడికి రాలేకపోయారని టీడీపీ నేతలు సభాముఖంగా వెల్లడించారు. కానీ, కేశినేని నాని కొద్ది నెలలుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
పార్టీకి, నానికి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చేందుకు కూడా నాని నిరాకరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇటీవల, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాల నేతల సమావేశం జరగగా…దానికి కూడా కేశినేని డుమ్మా కొట్టారు. దీనిపై చంద్రబాబు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. తాజాగా విశిష్ట ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశానికి కూడా నాని హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Comments 1