టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై రకరకాల కేసులు పెట్టి వేధించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ఫైబర్ నెట్ స్కాం అంటూ చంద్రబాబుతోపాటు లోకేష్ పై వైసీపీ నేతలు లేనిపోని అభాండాలు వేస్తున్నారు. దీంతో, అసలు వాస్తవాలు మరుగున పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు అసలు వాస్తవాలు తెలియజెప్పాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు తాజాగా ఓ పుస్తకం విడుదల చేశారు. ‘ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు’ పేరుతో ఓ పుస్తకాన్ని టీడీపీ ప్రచురించింది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీపీ నేత బోండా ఉమలు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, మచ్చలేని నాయకుడని అచ్చెన్న అన్నారు. ఆయనను అరెస్ట్ చేసి 30 రోజులైనా ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయారని పయ్యావుల చురకలంటించారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదన్న సంగతి జగన్ కు, మిగతా వైసీపీ నేతలకు కూడా తెలుసని, కేవలం చంద్రబాబుపై కక్ష సాధించడమే జగన్ లక్ష్యమని దుయ్యబట్టారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.