చరిత్రలో చెరగని ముద్ర తెలుగుదేశం సొంతం. సామాజిక చైతన్యం, పీడిత పాలన వ్యతిరేక దృక్పధం, శ్రామిక జనపక్షపాతం, సమ సమాజ నిర్మాణ ఆకాంక్షలతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అభివృద్ధి నిరోధక శక్తులను ప్రతిఘటించడం ద్వారా ఆకలి, దోపిడి, అణచివేతలు లేని ఉదాత్త సమాజ నిర్మాణమే ధ్యేయంగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గుండెల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం.
భౌతిక వాద, హేతుబద్దమైన తాత్విక దృష్టితో తెలుగునాట తలెత్తుతున్న సకల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలతో సజీవంగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. సైద్ధాంతిక నిబద్దత, బలమైన వర్తమానం, ఆశావహమైన భవిష్యత్ తెలుగుదేశం సొంతం. సామాజిక వ్యవస్థ కోసం, రాజకీయ వ్యవస్థ ఉండాలే గాని రాజకీయ వ్యవస్థ కోసం సామాజిక వ్యవస్థ ఉండకూడదనేది ఎన్టీఆర్ ఆలోచన.
సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్నప్పుడే ఎన్టీఆర్ తోటి నటుల భాగస్వామ్యం తో ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. రాయలసీమ క్షామం, దివిసీమ ఉప్పెన సమయంలో బాధితులకు అండగా నిలిచారు.
ఆనాటి రాజకీయ అస్థిరత్వంతో ఏడాది కాలంలో కాంగ్రెస్ నలుగురు ముఖ్యమంత్రులను మార్చి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టింది.
ఆ భానిస శృంఖలాలను భరించలేక ఎన్టీఆర్ మార్చి 29, 1982న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
కాలగమనంలో 40 ఏళ్లు చిన్నదేమీ కాదు. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను, అపజయాలను, ఎత్తుపల్లాలను చవిచూసింది. ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరంగా ప్రజలు భావించారు.
అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో ని తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేసి తెలుగు వాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం విజయబావుటాను ఎగురవేసింది.
అత్యంత తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. అధికారపక్షంగా, ప్రతిపక్షంగా ఎన్నో అవరోధారాలు, ఆటుపోట్లను ఎదుర్కుంటూ ఏ స్థాయిలో ఉన్నా ప్రజల పక్షానే నిలిచింది.
దేశంలోని అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీల్లో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ పార్టీల్లో లేని సిద్ధాంత నిర్ధిష్టత, రాజకీయ పరిణితి ఒక్క తెలుగుదేశంలోనే ఉన్నాయి. అందుకే జాతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీ విధానాలను అనుకరించాయి. అనుసరించక తప్పలేదు.
సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అని నినదించి… పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే తన రాజకీయ సిద్ధాంతమని వెలగెత్తి చాటడమే కాక ఆచరణలో చూపించి నిరూపించారు నందమూరి.
మొట్ట మొదటి సారిగా పాలనా పగ్గాలను అందిపుచ్చుకొన్న ఎన్టీఆర్ ప్రజాభీష్టం మేరకు పాలన సాగిస్తూ అవినీతికి కళ్లెం వేస్తూ, జవాబుదారి తనాన్ని పెంచి అలనాటి రామరాజ్యాన్ని తనదైన శైలితో ప్రజలకు కళ్లారా చూపించారు.
సంక్షేమ పధకాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్
పేదవాడి ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్నారు.
పేదలను పట్టిపీడిస్తోన్న పటేల్ పట్వారీ, మునుసూబు, కరణాల వ్యవస్థలను రద్దు చేసి, పరిపాలనను ప్రజల ముంగిట నిలిపేందుకు మాండలిక వ్యవస్థను తెచ్చి… తిరుగులేని సామాజిక సంస్కరణలతో రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసారు అన్న ఎన్టీఆర్ .
తెలుగుభాష, సంస్కృతులకు పూర్వ వైభవ, ప్రభవాలను తెచ్చారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి స్త్రీలకు సమున్నత గౌరవాన్ని ఇచ్చారు. ఆస్థిలో మహిళలకు సమాన హక్కు కల్పించారు. రైతులకు నీటి తీరువా రద్దు చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. స్వీయ బలిమి ఎంతటిదైనా శత్రువును ఏ దశల్లోను తక్కువగా అంచనా వేయకూడదనేది యుద్ధనీతి . కాని ఎన్టీఆర్ రాజకీయం అంటే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే అనుకున్నారు. యుద్ధమని అనుకోలేదు .
అమెరికాకు వెళ్లి గుండె సర్జరీ చేయించుకొని రాష్ట్రానికి చేరుకునే సమయంలోనే కుట్రకు తెరలేపారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైనా ప్రభుత్వాలను కూలగొట్టే సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ అలవాటుపడింది. ఎన్టీఆర్‌పై మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసేలా కొందలు హస్తినాదీశులు పురిగొల్పి తెలుగుదేశం ఎమ్మెల్యేలను చీల్చారు. అప్రజాస్వామికంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రామ్‌లాల్ తో రద్దు చేయించి నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంతో ప్రజాస్వామ్యం దుర్దినంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైనందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ఆయనకు మద్దతుగా ఆందోళనకు దిగటంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌కు వివిధ రాజకీయ పక్షాల మద్దతు లభించింది. ప్రజాగ్రహాన్ని గుర్తించిన నాటి కేంద్రం గవర్నర్ రామ్‌లాల్‌ను రీకాల్ చేసింది. ఆ స్థానంలో శంకర్‌దయాళ్ శర్మను నియమించింది. అసెంబ్లీలో బల నిరూపణకు ముందే నాదెండ్ల గద్దె దిగారు.
1984 సెప్టెంబర్ 20న ఎన్టీఆర్ అసెంబ్లీలో తన మెజారిటీని నిలబెట్టుకున్నారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాలపై తిరుగుబాటు చేసి తిరిగి ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. ఇందిర హత్య తాలూకు సానుభూతి పవనాలను తట్టుకుని 202 అసెంబ్లీ స్థానాలను, 35 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని పార్లమెంటులో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.
ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ స్థాయిలో మన్ననలు అందుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ తీసుకునే సాహసోపేత నిర్ణయాలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు విస్మయానికి గురి చేసేవి. తన మంత్రివర్గం అంతర్గత సమావేశంలో చర్చించిన అంశాలు బహిర్గతం కావడంతో మంత్రి వర్గాన్నే రద్దు చేశారు. సహచర మంత్రి అవినీతికి పాల్పడ్డారని మంత్రి వర్గం నుంచి తక్షణమే ఉధ్వాసనం పలికారు.
1984లో మూడోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనంతర కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. నేషనల్ ఫ్రంట్ తరపున వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, తరువాత ఎన్డీఏలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. తరువాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా 213 స్థానాలను దక్కించుకుని తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం 26 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
1995 ఆగస్టులో ఒక దుష్టశక్తి ఎన్టీఆర్ పక్కన చేరి పెత్తనం సాగించి, ఆయనకు, పార్టీకి, ప్రజలకు మధ్య దూరాన్ని పెంచి, ఇతర పార్టీ నాయకులకు కొమ్ముకాసే కుట్రకు పూనుకున్నారు. దీనితో టీడీపీలో ఏర్పడిన సంక్షోభం నుంచి భయటపడేసేందుకు, పార్టీని కాపాడుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు ముందుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులతో పాటు ఆయన కుటుంబ సభ్యులను సైతం సంప్రదించి విధిలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారు.
1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ ప్రజాశీస్సులు పొందుతూ ఉంది. మొట్ట మొదటిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలన అందించారు. జన్మభూమి , ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షించారు. కేంద్రంలో బి.జే.పి ఆధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
జాతీయ స్థాయిలో దేవ గౌడ, ఐ.కే. గుజ్రాల్ లను ప్రధానమంత్రులుగా చేయడానికి ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా శ్రమించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా నియమించాలని ప్రతిపాదన పెట్టింది కూడా చంద్రబాబే. పెను సంక్షోభాల సమయంలో సడలని నిగ్రహం, కార్యదక్షత, రాజనీతిజ్ఞత కలగలిపిన వ్యక్తిత్వం చంద్రబాబు సొంతం. తన విజనరీతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. విజన్ 2020, విజన్ 2050తో రేపటి తరానికి ఏం కావాలో ముందు నుంచే ప్రణాళికలు రూపొందించారు..
అందులో భాగంగానే హైదరాబాద్ లో సైబరాబాద్, ఏపీలో అమరావతి నగరాలు వెలిశాయి. నేటి పాలనలో అటువంటి విజనరీలు లేవు, ముందుచూపు పాలన అంతకంటే లేదు. నేరం, రాజకీయం సహాజీవనం చేస్తున్న సమాజంలో జీవిస్తున్నాం. నేరగాళ్లను, హంతకులను, దొంగలను, దోపిడీదారులను ఎన్నుకునే ప్రజలు బాధితులు కాదు భాగస్వామ్యులవుతారని జార్జ్ ఓర్వెల్ అనే చరిత్ర కారుడు అన్నారు. ఆనాడు ఆయన చేసిన వ్యాఖ్యలు నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజకీయ మదాంధకార శక్తుల క్రీడాంగణంగా కునారిల్లుతున్న ఆంధ్రావని దుస్థితి కళ్లకు కడుతుంది. నేర, స్వార్ధ, అవినీతి రాజకీయ నాయకుల ఇనుప సంకెళ్లల్లో చిక్కిన రాష్ట్రానికి గత 3 ఏళ్లుగా ఊపిరి ఆడటం లేదు. వెనకబడిన వర్గాల సమూహాల ఉద్ధరణ కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది.
పార్టీ స్థాపనకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,కాపు వర్గాలంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాని… టీడీపీ పుట్టిన తరువాత మొట్ట మొదటి సారిగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారు. టీడీపీ అంటే నాయకులను సృష్టించే కర్మాగారంగా నిలిచిపోయింది. కొందరు టీడీపీ నుంచి నాయకులై, రాజకీయంగా ఎదిగిన తరువాత పార్టీ మారి తిరిగి అదే పార్టీపై, పార్టీ నాయకుడిపై కయ్యానికి కాలు దువ్వటం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటంతో సమానమన్న సంగతి నాయకులు విస్మరిస్తున్నారు. అధికారం ఎవరి సొత్తు కాదు గెలుపోటములు దైవాదీనాలు .
అధికారం ఉంది కదా అని విర్రవీగకూడదు, లేదని నిరుత్సాహపడకూడదు. అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడమే తెలుగుదేశం పార్టీ అంతిమ లక్ష్యం. ఏ ఆశయం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారో, ఏ లక్ష్య సాధన కోసం ఎన్టీఆర్ అవిశ్రాంత పోరాటం చేశారో, ఆ బృహత్తర పవిత్ర మహా యజ్ఞంలో అందరం భాగస్వాములై తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవ, ప్రాభవాలను తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
(మార్చి 29న తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లు పూర్తైన సందర్బంగా)
మన్నవ సుబ్బారావు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్
9949777727