రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగు దేశం(టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్(వైసీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో.. తెలిస్తే.. ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. టీడీపీ వద్దే ఎక్కువగా నిధులు, ఆస్తులు ఉన్నాయని తాజాగా వచ్చిన నివేదిక స్పష్టం చేసింది.
ప్రముఖ సంస్థ… ది అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలో అత్యంత ధనిక పార్టీల వివరాలు తెలిశాయి. వీటిలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ మాజీ అధికార పార్టీ సమాజ్ వాదీ(ఎస్పీ) ముందంజలో ఉంది.
సమాజ్‌వాదీ పార్టీకి 572 కోట్ల రూపాయల డిపాజిట్లు, మూలధన నిల్వలు ఉన్నాయి. ఇక, దీని తర్వాత స్థానంలో చిత్రంగా ఒడిసా అధికార పార్టీ బిజు జనతాదళ్ పార్టీ(బీజేడీ) నిలిచింది.
ఇక్కడ చిత్రం అని ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ప్రజల కోసమే.. తాను అంకితమయ్యానని బీజేపీ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ తరచుగా చెబుతారు. అందుకే తాను వివాహం కూడా చేసుకోలేదని అంటారు.కానీ, ఆయన పార్టీ దగ్గర మాత్రం 232 కోట్ల రూపాయల మూలధనం నిల్వలు ఉన్నాయి. ఇక, అందరూ అనుకునే విధానానికి భిన్నంగా.. తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే వద్ద మాత్రం 206 కోట్లే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.
ఇక, తర్వాత స్థానం అంటే.. నాలుగో ప్లేస్‌లో ఏపీ మాజీ అధికార పార్టీ టీడీపీ నిలిచింది. టీడీపీ దగ్గర 193 కోట్ల నిధులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడింది. నిజానికి సీఎం జగన్ పార్టీకి ఎక్కువగా నిధులు ఉన్నాయని భావిస్తారు. కానీ, టీడీపీ వద్దే.. ఎక్కువగా ఉన్నాయని ఈ నివేదిక వివరించింది.
అదేవిధంగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ వద్ద.. 188 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏపీ అధికార పార్టీ వైసీపీ ఈ క్రమంలో ఆరోస్థానం దక్కించుకుంది. ఈ పార్టీ మూల నిధులు 93 కోట్ల రూపాయలు ఉన్నాయట!
ఇక, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. టీడీపీకి రూ.115 కోట్లు, టీఆర్ ఎస్‌కు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక, ఇదంతా కూడా 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి లెక్కలుగా ఏడీఆర్ పేర్కొనడం గమనార్హం.
ఇక, జాతీయ పార్టీలను తీసుకుంటే.. బీజేపీ చాలా ముందంజలో ఉంది. ఈ పార్టీకి 2904 కోట్ల నిధులు ఉన్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే.. కేవలం 928 కోట్ల రూపాయల నిధులే ఉన్నాయని నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.