తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఏపీ ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే…ఏపీలో సామాన్యుల సంగతేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో డీజీపీ సవాంగ్ విఫలం అయ్యారని టీడీపీ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
ఢిల్లీలో సీఈసీని కలిసిన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ లు… చంద్రబాబు రోడ్ షోపై రాళ్లదాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతోపాటు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని, కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో 2 లక్షల వరకు నకిలీ ఓటరు కార్డులున్నాయని, కాబట్టి 2 అదనపు ఐడీ కార్డులు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని, పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బలగాల పహారాలో తిరుపతి ఉప ఎన్నిక జరిపించాలని కోరారు.
మరోవైపు, రాళ్లదాడి ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఫిర్యాదు చేసి విచారణ జరపాలని వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు బయటకు వెళ్తే సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనను పదేపదే అడ్డుకుంటున్నారని, ప్రధాన ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు.
మంత్రులు బజారు రౌడీల మాదిరిగా మాట్లాడుతూన్నారని, చంద్రబాబుపై దాడి చేసి తమపై నింద మోపుతారా? అని దుయ్యబట్టారు.మంత్రులు చీప్‌గా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు భద్రతపై ఇప్పటి వరకు ప్రభుత్వం రివ్యూ చేయలేదని మండిపడ్డారు.. రాజకీయాల కోసం వ్యక్తిగతంగా దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. డీఐజీ కాంతి రాణా దాడి జరగలేదని ఎలా చెప్తారని, రాళ్ళ దాడి జరగనప్పుడు చంద్రబాబు రాళ్లు తీసుకుని సభకు వచ్చారా? అని ప్రశ్నించారు.