ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తుది శ్వాస విడిచారు. గుండెపోటుకు గురై కొంతకాలంగా విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్జునుడు ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. రక్తపోటు అదుపులోకి రాక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లుగా తెలుస్తోంది. జనవరి 28న అర్జునుడికి గుండెపోటు రావడంతో వైద్యులు ఆయనకు స్టెంట్ వేసి కొద్ది వారాలుగా చికిత్స అందిస్తున్నారు.
1995 నుంచి రాజకీయాల్లో ఉన్న బచ్చుల అర్జునుడు 1995 నుంచి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పి.ఏ.సి.ఎస్) అధ్యక్షుడిగా పని చేశారు. 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్గా పని చేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017లో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు.
మరోవైపు, బచ్చుల అర్జునుడు మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని చంద్రబాబు అన్నారు. నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటారని అనుకున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అర్జునుడి మృతి సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని లోకేష్ అన్నారు. నిజాయితీకి మారుపేరు, అజాతశత్రువుగా పేరున్న అర్జునుడు టీడీపీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు, అర్జునుడి మృతికి సంతాపంగా రేపు అమరావతిలో జరగాల్సిన టీడీపీ జోన్ -3 సమీక్షా సమావేశం వాయిదా వేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.