చంద్రబాబును, టీడీపీ నేతలను కొడాలి నాని నీచమైన భాషతో తిట్టడం 2024 మే వరకు విచ్చలవిడిగా సాగింది. అధికారం పోయినప్పటి నుంచి మౌనం పాటిస్తున్నాడు. కానీ తాజాగా చంద్రబాబుపై విమర్శలు చేయడం మొదటుపెట్టిన గుడివాడ నానికి ఎమ్మెల్యే రాము గట్టి వార్నింగే ఇచ్చాడు. వైసీపీ సర్కారులో నాటి విపక్ష నేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా ఉండేవి. పెద్ద ఎత్తున విమర్శలకు కారణమయ్యేవి. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ ఎపిసోడ్ నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన కొడాలి నాని దూకుడు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొడాలి నాని ప్రెస్ మీట్ కు కౌంటర్ ప్రెస్ మీట్ గా టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తీవ్రంగా విరుచుకుపడటమే కాదు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. ‘‘పిచ్చి వాగుడు మానుకో. నోరు అదుపులో పెట్టుకో. లేదంటే తరిమి తరిమి కొడతారు. విజయవాడలో వరదల సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కొడాలి నాని ఏమయ్యారు? ఎక్కడకు వెళ్లారు? ఎందుకు కనిపించకుండా పోయారు? ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చంద్రబాబుపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తంచేవారు.
గతంలో ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరగొట్టినప్పుడు బొమ్మే కదా ఏమతుందన్న విషయాన్ని మాట్లాడటాన్ని మర్చిపోయావా? నాని అని ప్రశ్నించారు. ‘‘దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు చోరీకి గురైతే ఎంత ఖర్చు అవుతుందని మాట్లాడారు. అలాంటి కొడాలి నానికి ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? నువ్వు గుర్తొస్తే.. నీ మాటలు గుర్తొస్తేనే గుడివాడ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇకనైనా పిచ్చి వాగుడు మానకపోతే గుడివాడ ప్రజలు తరిమి తరిమి కొడతారు’ అంటూ నిప్పులు చెరిగారు.
తన కష్టంతో.. సుపరిపాలనతో స్కై రాకెట్ అంత ప్రతిష్టను చంద్రబాబు సంపాదించారని.. అధ:పాతాళంలో ఉన్న జగన్ పై విష ప్రచారం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు వెనిగండ్ల రాము. ప్రజలు ఛీ కొట్టి రిజెక్ట్ చేసిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడి గురించి కొడాలి నాని మాట్లాడితే విడ్డూరంగా ఉంటుందన్నారు.