అధికార పార్టీ టీడీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో టీడీపీకి బ్యాడ్ నేమ్ వస్తోంది. పైగా ఆ బ్యాడ్ నేమ్ పార్టీకే కాకుండా.. పార్టీ అధినేత, సీఎం చంద్ర బాబుకు కూడా చుట్టుకుంటోంది. మంచి పాలలో చిన్న ఉప్పుగల్లు పడ్డట్టుగా.. ఇలాంటి నాయకుల వ్యవహారంతో మొత్తానికే బ్యాడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా కలకలం రేగుతోంది.
తాజాగా ఆయన ఓ మీడియా మిత్రుడికి ఫోన్ చేసి.. తీవ్రస్థాయిలో బెదిరించినట్టు తెలిసింది. తన గురించి కానీ.. తన తమ్ముడి గురించి కానీ.. వార్తలు రాస్తే.. రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఆయన బెదిరించిన విలేకరి టీడీపీ అనుకూల మీడియాలో పనిచేస్తుండడమే. దీనిపై స్థానికంగా జర్నలిస్టులు మండిపడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. ధర్నాలు, నిరసనలకు కూడా రెడీ అవుతున్నారు.
ఆది నుంచి వివాదమే..
గతంలో టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన గుమ్మనూరు.. వైసీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే ఆలూరు నుంచి విజయం దక్కించుకుని మంత్రి పదవి చేపట్టారు. ఈ సమయంలో ఆయన అవినీతి పాల్పడ్డాడంటూ.. ప్రస్తుత స్పీకర్.. అప్పటి టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. తన కుమారుడికి బెంజ్ కార్ బహుమతిగా తీసుకున్నారని ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఇక, భూముల కబ్జా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.
తాజాగా గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ బాట పట్టిన జయరాం.. గుంతకల్ నుంచి విజయం సాధిం చారు. అయితే.. ఆయన సోదరుడిపై పలు అవినీతి, అక్రమ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ కీలక మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే.. ఇక నుంచి వాటిని ఆపేయాలని.. లేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ.. గుమ్మనూరు బెదిరించినట్టు ఓ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పరిణామాలు.. అధినేత చంద్రబాబుకు చుట్టుకుంటున్నాయి. ప్రతిపక్ష మీడియ పెద్ద ఎత్తున దీనిని హైలెట్ చేస్తుండడంతో సర్కారుకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుండడం గమనార్హం.